బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ ఆఫీసుకు క్యూ కడుతూండటంతో అఖిలేష్‌కు కొత్త సమస్యలు వస్తున్నాయి. పార్టీ టిక్కెట్ల సర్దుబాటు .. ఇతర అంశాలను పక్కన పెడితే.. కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేయడంతో అఖిలేష్ ఒక్కసారిగా వెనుకడుగు వేశారు. ఇక బీజేపీ నేతల్ని చేర్చుకునే చేర్చుకోబోమని… కావాలంటే ఎస్పీ నేతల్ని కూడా చేర్చుకోవద్దని బహిరంగంగా ప్రకటించారు. దీనికి కారణం ఎస్పీ నుంచి ఎవరెవరో వెళ్లి బీజేపీలో చేరతారనే భయం కాదు. ఆయన తమ్ముడు భార్యనే వెళ్లి చేరుతారనే ఆందోళన.
అఖిలేష్‌కు సమాజ్ వాదీ పార్టీ విషయంలో మొదటి నుంచి కుటుంబసమస్యలు ఉన్నాయి. మొదట బాబాయ్ శివపాల్, తర్వాత అఖిలేశ్ సవతి సోదరుడైన ప్రతీక్ యాదవ్ కుటుంబం నుంచి ఇబ్బందులు ఉన్నాయి. శివపాల్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ అఖిలేష్‌తో పొత్తు పెట్టుకున్నారు. కానీ ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. రాజకీయంగా ఎంతో ఆసక్తి ఉన్న ఆమెకు ఎస్పీ టిక్కెట్ ఇచ్చేందుకు అఖిలేష్ నిరాకరించారు. కానీ ములాయం జోక్యంతో 2017ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. కానీ ఓడిపోయారు.
ఆ తర్వాత ఎస్పీలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ఈ సారి టిక్కెట్ ఇస్తారో లేదో స్పష్టత లేదు. దీంతో ఆమె బీజేపీ వైపు చూస్తున్నారు. ఇటీవల ఆమె బీజేపీని పొగుడుతున్నారు. దీంతో బీజేపీ ఆమెతో చర్చలు జరుపుతోదంి. తమ్ముడి భార్యను ఆపలేకపోతే… అఖిలేశ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇంటి పోరు వల్ల సమస్యలు వస్తాయంటున్నారు. నిజానికి అపర్ణా సొంత తమ్ముడి భార్య కాదు. ములాయంసింగ్ రెండో భార్య సాధనా గుప్తాకు మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమారుడే ప్రతీక్ యాదవ్. ఆయన భార్య అపర్ణ.