ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. సహజంగా గెలిచే పార్టీ దిశగా వలసులు ఉంటాయి. సర్వేల్లో యూపీలో బీజేపీ గెలవబోతోందని గత ఆరు నెలులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. జాతీయ మీడియా పేరుతో.. కొంత మంది అదే పనిగా బాకా ఊదేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు బీజేపీ నేతలకు బాగా తెలిసినట్లుగా ఉన్నాయి. వారు మాత్రం గెలిచే పార్టీగా సమాజ్ వాదీ పార్టీని నిర్ణయించేసుకుని ఆ పార్టీకి క్యూ కడుతున్నారు. మంత్రులు , ఎమ్మెల్యేలు ప్రతి రోజూ సమాద్ వాదీ ఆఫీసుకు వెళ్తున్నారు. అఖిలేష్‌తో కండువా కప్పించుకుంటున్నారు.
ఏడు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో మొత్తం పద్దెనిమిది మంత్రులు ఎస్పీ లో చేరాలని డిసైడయినట్లుగా తెలుస్తోంది. నలభై మంది ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వారి వారి సామాజికవర్గాల్లో పట్టున్న వ్యక్తులే. ఈ కారణంగా బీజేపీ కూడా టెన్షన్ పడుతోంది. గెలిచే పార్టీ అన్న ప్రచారాన్ని వీలైనంత ఎక్కువగా చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రజల్లోనూ.. బీజేపీ నేతల్లోనూ సమాజ్ వాదీ పార్టీ గెలుస్తుందన్న అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో ముందస్తుగా అందరూ సమాజ్ వాదీలోకి చేరుతున్నారు.
సమాజ్ వాదీ పార్టీ చీఫ్‌గా అఖిలేష్ యాదవ్ పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అతి పెద్ద రాష్ట్రంలో పార్టీని తెలివిగా నడిపిస్తున్నారు. బీజేపీ ఒత్తిళ్లకు ఎక్కడా తలొగ్గడంలేదు. చిన్న చిన్న పార్టీల్ని కలుపుకుని పోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తన మీద కోపంతో సొంత పార్టీ పెట్టుకున్న బాబాయ్‌ను కూడా ఏ మాత్రం శషబిషలు లేకుండా కలుపుకున్నారు. అఖిలేష్ రాజకీయం బీజేపీ నేతలకు నిద్రపట్టనీయడం లేదు. దీంతో ఉత్తరప్రదేశ్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.