ములాయం కుటుంబంలో ముసలం క్లైమాక్స్ కు చేరింది. సమాజ్ వాదీ పార్టీలో పోరు తుది అంకానికి చేరింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గం ఏకంగా అధినేత ములాయం సింగ్ యాదవ్ కే చెక్ పెట్టింది. లక్నోలోని పార్టీ ఆఫీసును ఆక్రమించుకుంది. ఎటు చూసినా అఖిలేష్ దూకుడే కనిపిస్తోంది. దీంతో ములాయం వర్గం డీలా పడింది.
కొత్త ఏడాది ప్రారంభం నాడు పార్టీలో పరిణామాలు వేగంగా మారాయి. తనయుడు అఖిలేష్ ను, కజిన్ రాంగోపాల్ యాదవ్ ను ములాయం శుక్రవారం నాడు పార్టీ నుంచి బహిష్కరించారు. శనివారం అఖిలేష్ తన సత్తాను చాటారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సుమారు 200 మంది హాజరు కావడంతో అఖిలేష్ కు తిరుగులేదని రుజువైంది. ఆ తర్వాత అఖిలేష్ తన తండ్రి నివాసానికి వెళ్లి చర్చించారు. ఫలితంగా అఖిలేష్, రాంగోపాల్ ను ములాయం తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. కథ సుఖాంతమైందని అనుకుంటుండగా ఊహించని ట్విస్ట్.
ఆదివారం అఖిలేష్ వర్గం జోరు పెంచింది. రాంగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ కార్యవర్గ ప్ర్తత్యేక సమావేశం జరిగింది. ఇందులో అఖిలేష్ ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలంటూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. ములాయం మార్డదర్శి పాత్రకు పరిమితం కావాలని సూచించారు. దీంతో ములాయం ఆగ్రహించారు. ఈ సమావేశం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించారు. రాంగోపాల్ ను మళ్లీ బహిష్కరించారు. మరో ఎంపీ రాంనరేష్ యాదవ్ పైనా బహిష్కరణ వేటు వేశారు.
అటు లక్నోలోని పార్టీ ఆఫీసులో సాయంత్రం హైడ్రామా నడిచింది. అఖిలేష్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆ భవనంలోకి వెళ్లారు. పార్టీ ఆఫీసులను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ములాయం వర్గీయులు లోపలికి రాకుండా తాళం వేశారు. మొత్తానికి తండ్రితో తాడోపేడో తేల్చుకోవడానికే అఖిలేష్ సిద్ధమయ్యారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం పార్టీలో అఖిలేష్ హవా నడుస్తోందని, ఇక ములాయం పని అయిపోయిందని లక్నోలో టాక్ వినిపిస్తోంది. అఖిలేష్ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ములాయం, ఆయన తమ్ముడు శివపాల్ వర్గీయులు మాత్రం పూర్తిగా డీలా పడిపోయారు. ములాయం హవా తగ్గిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.