ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు వేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చారు. కేసీఆర్ తో సమావేశయ్యారు. దేశ రాజకీయాల్లో మార్పు కేసీఆర్ చేయబోతున్న ప్రయత్నానికి మద్దతు ఇచ్చారు. అనంతరం మీడియాతో అఖిలేష్ మాట్లాడుతూ… దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనీ, అందుకు ఉదాహరణే యూపీలో రెండు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలు అని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇదేదో చిన్న ప్రయత్నమని కొంతమంది అనుకుంటున్నారనీ, 2019 ఎన్నికల కోసం పడుతున్న ప్రయాస అని అనుకోవడం సరికాదన్నారు. దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు కోసం చేస్తున్న ఓ గొప్ప ప్రయత్నం అన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పారు.
అఖిలేష్ మాట్లాడుతున్నప్పుడు… ‘మీరు రాహుల్ గాంధీకి సన్నిహితులు కదా, ఈ కూటమిలో ఆయన వచ్చే అవకాశం ఉందా..? ఎవరితో జత కట్టేందుకు ఈ కూటమి సిద్ధంగా ఉంది’ అని విలేకరులకు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పడం విశేషం. ఈ ప్రయత్నంలో రాజకీయాలను తక్కువగా చూడండి అన్నారు. దేశంలో ఒక గుణాత్మకమైన మార్పువైపు జరుగుతున్న ప్రయత్నంగా మాత్రమే చూడాలని కోరారు. ఎక్కడి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ కూటములుంటాయనీ, ఇది 2019 ఎన్నికలను దృష్టిలో చేస్తున్న ప్రయత్నం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత కూడా ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందనీ, 70 ఏళ్ల పాలనలో దేశం మారిందేమీ లేదనీ, ఇప్పుడు కొత్త మార్పు అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
అయితే, మార్పు ఏదైనా రాజకీయాలతోనే సాధ్యమౌతుంది. కానీ, తమ ప్రయత్నం ఇంకా ప్రారంభ దశలో మాత్రమే ఉందనీ, తాము ఎంత దూరం వెళ్తామో, ఎటువైపు వెళ్తామో అనేది ముందుకు వెళ్తున్నకొద్దీ తెలుస్తుందన్నారు. ఈ క్రమంలో చాలా పార్టీలను కలుపుకుని వెళ్లాల్సి ఉంటుందనీ, ఆ తరువాత అందరి నిర్ణయంతో ఒక అజెండా రూపుదిద్దుకుంటుందనీ, ఆ తరువాత రాజకీయంగా వైఖరి ఏంటనేది స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు.
భాజపాయేతర, కాంగ్రెసేతర ఫ్రెంట్ ఏర్పాటు అంటూ కేసీఆర్ ప్రయత్నిస్తూ వెళ్తున్నారు. దీనిపైనే కొంత అస్పష్టత ఉంది. ఎందుకంటే, కేసీఆర్ కలుస్తున్న, కలుసుకోబోతున్న పార్టీల్లో చాలావరకూ కాంగ్రెస్ అంటే వైరం లేనివే. అందుకే, ఈ కూటమి రాజకీయ వైఖరి ఏంటనేది సందిగ్ధంగానే ఉంది. దానిపై కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి, స్పష్టత అనే కంటే… సందిగ్దాన్ని కొంత దూరం వాయిదా వేసే ప్రయత్నం చేశారని చెప్పడం కరెక్ట్..!