సమాజ్ వాదీ పార్టీలో సైకిల్ యుద్ధం పరాకాష్టకు చేరింది. తండ్రి ములాయం, కొడుకు అఖిలేష్ వర్గాలు తమ మద్దతుదారులైన ప్రజా ప్రతినిధుల జాబితాలను ఎన్నికల కమిషన్ కు సమర్పించాయి. ఈనెల 17న యూపీలో తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆలోగా ఒక నిర్ణయ తీసుకోవాలని ఇరు వర్గాలూ ఈసీని కోరాయి.
పార్టీలో పరిస్థితిని గమనిస్తే అఖిలేష్ పూర్తిస్థాయి పట్టు సాధించినట్టు కనిపిస్తుంది. ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్ ఎన్నికల కమిషన్ కు రెండు రోజుల క్రితం జాబితా సమర్పించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, పార్టీకి చెందిన 229 మంది ఎమ్మెల్యేలలో 212 మంది అఖిలేష్ కు మద్దతుగా సంతకాలు చేశారు. పార్టీకి చెందిన 68 మంది ఎం ఎల్ సిలలో 56 మంది అఖిలేష్ కు మద్దతిచ్చారు,
ఇక పార్టీకి చెందిన 24 మంది ఎంపీల్లో 15 మంది అఖిలేష్ కు మద్దతుగా సంతకాలు చేశారని రాంగోపాల్ యాదవ్ చెప్పారు. అదేనిజమైతే సమాజ్ వాదీ లెజిస్టేచర్ పార్టీ, పార్లమెంట్ పార్టీలోనూ అఖిలేష్ కే మెజారిటీ ఉన్నట్టు లెక్క. అలాగే పార్టీ జాతీయ కార్యవర్గంలోనూ మెజారిటీ నేతలు అఖిలేష్ వైపు ఉన్నారు. ఉండటమే కాదు, గత వారం ఆయన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఒక వేళ అఖలేష్ కే సైకిల్ గుర్తు దక్కితే అప్పుడు సమాజ్ వాదీ పార్టీలో ములాయం పరాయివ్యక్తి అవుతారు. తాను స్థాపించిన పార్టీకే తాను ఏమీ కాకుండా పోతారు. అప్పుడు మరో పార్టీ పేరుతో, మరో ఎన్నికల గుర్తుతో పోటీకి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ వర్గానికి మెజారిటీ ఉందనేది తేలకపోతే సైకిల్ గుర్తును ప్రస్తుతానికి స్తంభింప చేయాలని ఈసీ నిర్ణయించ వచ్చు. అప్పుడు రెండు వర్గాలకూ చెరో గుర్తు ఇస్తారు. ఆ గుర్తులు జనంలోకి వెళ్లడానికి సమయం పడుతుంది. ఈలోగా ఎన్నికలు అయిపోతాయి.
అఖిలేష్ వర్గం మాత్రం సైకిల్ గుర్తు తమకే వస్తుందని ధీమాగా ఉంది. అలాగే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని దాని ఓటు బ్యాంకును కూడా తన ఖాతాలోకి వచ్చేలా చూడాలని ప్రయత్నం జరుగుతోంది. మరి అఖిలేష్ తండ్రిని మించిన తనయుడు అవుతారా? ఈనెల 17 లోగా తేలిపోతుంది.