సురేందర్ రెడ్డి లాంటి దర్శకులతో ఓ చిక్కు ఉంది. వాళ్లకు ఏదీ ఓ పట్టాన నచ్చదు. పర్ఫెక్షన్ కోరుకుంటారు. అలాంటప్పుడు నిర్మాతకు బెంగొస్తుంది. ఎందుకంటే.. పర్ఫెక్షన్ అంటూ కూర్చుంటే బడ్జెట్ పెరిగిపోతుంటుంది. `ఏజెంట్`కి కూడా ఇదే జరిగింది. ఈ సినిమాకి రిపేర్లు చాలా జరిగాయని, తీసిన సీన్లే మళ్లీ తీయాల్సివచ్చిందని, దాంతో బడ్జెట్ పెరిగిపోయిందని గుసగుసలు వినిపించాయి. ఈ సినిమాకి మొత్తమ్మీద రూ.65 కోట్ల బడ్జెట్ అయ్యిందని టాక్. అఖిల్ పై రూ.65 కోట్లంటే రిస్కీ వ్యాపారమే. కాకపోతే.. పాన్ ఇండియా మార్కెట్ కాపాడుతుందన్న భరోసా.. నిర్మాతలకు ఉంది. దాంతో పాటు నాన్ థియేటరికల్ రైట్స్ రూ.38 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే… మరో రూ.27 కోట్లు థియేటర్ నుంచి రాబడితే సరిపోతాయి. థియేటరికల్ రైట్స్ రూపంలో కనీసం రూ.40 కోట్లయినా వస్తాయని చిత్రబృందం ఆశ పడుతుంది. అటూ ఇటూగా కనీసం రూ.10 కోట్లయినా టేబుల్ ప్రాఫిట్ సంపాదించే ఛాన్స్ ఉంది. బడ్జెట్ పెరిగిపోయింది, చేయి దాటిపోయిందనుకొన్న సినిమా.. నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ మిగులుస్తుందంటే అంతకంటే ఏం కావాలి? ఏజెంట్ టీజర్… శుక్రవారం విడుదలైంది. టీజర్ స్టైలీష్‌గా ఉంది. యాక్షన్ డోసు బాగానే కనిపిస్తోంది. దాంతో… ఈ సినిమాపై నమ్మకాలు మెల్లిగా పెరిగాయి. ఎలా చూసినా ఏజెంట్ నిర్మాతలకు లాభదాయకమైన ప్రాజెక్టే.