అఖిల్.. టాలీవుడ్లో అగ్ర హీరోగా చలామణీ అవుతున్న నాగార్జున ముద్దుల కొడుకు. చేతిలో నిర్మాణ సంస్థ ఉంది. కుర్రాడిలో మంచి ఈజ్ ఉంది. తనపై క్రేజ్ ఉంది. కానీ… రెండో సినిమా ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. కనీసం ఎవరితో అన్నది రూఢీ అవ్వలేదు. రోజుకో పేరు..పూటకో న్యూస్. ఇలా సాగుతోంది అఖిల్ వ్యవహారం. వెనుక ఇంత బ్యాక్ గ్రౌండ్ పెట్టుకొని, రెండో సినిమా విషయంలో ఎందుకిన్ని తిప్పలు పడుతున్నాడు, సరైన గైడెన్స్ లేదా, చెప్పేవారు లేరా, పెట్టు బడి పెట్టేవాళ్లు లేరా, దర్శకులు లేరా, ఏమిటి.. అఖిల్ బాబుతో సమస్య..?
అఖిల్ డిజాస్టర్ అవ్వడంతో అఖిల్ కోలుకోలేకపోయాడు. నిజానికి ఆ సినిమాపై అఖిల్‌కే కాదు.. చిత్రసీమకూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అవి ఒక్కసారిగా తలకిందులవ్వడంతో అఖిల్ డిప్రెషన్‌కి వెళ్లిపోయాడని టాక్. రెండో సినిమా విషయంలో తప్పు చేస్తే, ఇక కెరీర్ ముందుకు సాగదన్నది అఖిల్‌లో భయం. ఇప్పుడు తప్పు చేస్తే.. మళ్లీ కోలుకోవడం కష్టమని అఖిల్‌కీ తెలుసు. అందుకే చాలా చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. ఈ కేరింగ్ నెస్ మంచిదే. కానీ.. అఖిల్ మరీ అతిగా ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తోంది. తొలి సినిమా అఖిల్ కథేం గొప్పది కాదు. వినాయక్‌ని నమ్ముకొని లాగించేశాడు. కానీ రెండో సినిమా కోసం మాత్రం కథ విషయంలోనే అఖిల్ పేచీ పెడుతున్నాట. మరీ ప్రయోగాత్మకంగా ఉండకపోయినా, అందులో యునిక్ పాయింట్ ఉంటేనే చేస్తానంటున్నాడట.అలాంటి పాయింట్‌తో కొత్త దర్శకులు వచ్చినా…. వాళ్లకు అనుభవం లేదన్న భయంతో వాళ్లని పక్కన పెడుతున్నాడని టాక్. మరి సీనియర్లేమో కేవలం పాయింట్ పట్టుకొని తన దగ్గరకు వస్తున్నారట. దాంతో కొత్త వాళ్లలో సర్దుకుపోవాలా, లేదంటే మరోసారి సీనియారిటీని నమ్ముకోవాలా అన్నది తేల్చుకోలేకపోతున్నాడని తెలుస్తోంది.
అంతే కాదు.. తొలి సినిమాలో ఫైట్లు చేశా.. రెండో సినిమాలో వాటిని కంటిన్యూ చేయకపోతే బాగోదు.. అందుకని యాక్షన్ యాంగిల్ కూడా ఉండాల్సిందే అంటూ కండీషన్లు పెడుతున్నాడట. అన్నింటికంటే మించి.. ఏ కథ చెప్పాలన్నా, ముందు నాగార్జుననీ, అమలనీ కలసి ఆ కథని చెప్పి, వాళ్లని ఒప్పించి.. అప్పుడు అఖిల్‌కి వినిపించాలట. వీటన్నింటి మధ్య అఖిల్‌తో పనిచేయడం కష్టమని కొంతమంది దర్శకులు డ్రాప్ అవుతున్నారని తెలుస్తోంది. అందుకే రెండో సినిమా వ్యవహారం రోజురోజుకీ నానిపోతోందట. రెండో సినిమాకే బాబుగారు ఇన్ని తిప్పలు పడుతుంటే.. భవిష్యత్తు మాటేంటో..??