పాకిస్తాన్ మళ్ళీ మాట మార్చింది. జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ ని పాక్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు రెండు రోజుల క్రితం పాక్ మీడియాలో వార్తలు వచ్చేయి. అతనిని అరెస్ట్ చేసినట్లు మీడియాలో వార్తలు రాగానే జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఒక వీడియోని విడుదల చేసింది. వెంటనే పాక్ మాట మార్చి అతని అరెస్ట్ గురించి సమాచారం లేదని ప్రకటించింది. పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి క్వాజీ ఖలీలుల్లా నిన్న పాక్ మీడియాతో మాట్లాడుతూ మసూద్ ని అరెస్ట్ చేసినట్లు తన వద్ద ఎటువంటి సమాచారము చేలేదని చెప్పారు. అతని అరెస్ట్ ని దృవీకరించడానికి నిరాకరించారు.
భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగానే మళ్ళీ మాట మార్చి అరెస్ట్ చేయలేదు కానీ నిర్బందించామని చెపుతోంది. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రాణా సనౌవుల్లా నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ “జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్, ఆయన అనుచరులు కొందరిని ‘రక్షిత కస్టడీ’లోకి తీసుకొన్నాము కానీ అరెస్ట్ చేయలేదు. ఆయనపై విచారణ జరిపి, పఠాన్ కోట్ దాడికి కుట్ర పన్నినట్లు రుజువయినట్లయితే అరెస్ట్ చేస్తాము,” అని తెలిపారు.
దీనిని బట్టి అతనిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించడానికి పాక్ ఎంత భయపడుతోందో అర్ధం చేసుకోవచ్చును. ఒకవైపు భారత్ మరియు ప్రపంచ దేశాల ఒత్తిడి, మరొకవైపు అంతర్గతంగా ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్న కారణంగానే మసూద్ అజహర్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించడానికి పాక్ ప్రభుత్వం తడబడుతున్నట్లుంది. దీనిని బట్టి పాక్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చును. అందుకే పాకిస్తాన్ హామీలను, మాటలను నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు నిన్న సాయంత్రం మాట్లాడుకొన్న తరువాత ఈరోజు ఇస్లామాబాద్ లో జరుగవలసిన విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేద్దామని నిర్ణయించుకొన్నట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.