‘అందాల రాముడు` నాటి మాట. ఈ సినిమాపై పంచ ప్రాణాలు పెట్టేసుకున్నారు బాపు – రమణలు. ఈ సినిమాకి ఓరకంగా వాళ్లే నిర్మాతలు కూడానూ. గోదావరి నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే.. రాజమండ్రికి దగ్గర్లో షూటింగు మొదలైంది. ఈ సినిమా కోసం ఓ ఓడనే సిద్ధం చేశారు బాపు రమణ. అందులోనే నటీనటులు, సాంకేతిక నిపుణులకు బస. భోజనాలూ బ్రహ్మాండంగా ఉండేవి. ఘటోద్కచ అనే పేరుతో ఓ విడిది ఏర్పాటు చేసి – పెళ్లి భోజనాన్ని తలపించేలా తినిపించేవారు. దాదాపు 300 మంది బృందం. వాళ్లందరికీ బల్లలు, కుర్చీలు వేసి విందు నడిపించడం కష్టం కాబట్టి.. పెరుగున్నం, సాంబారన్నం, మసాలా వడలు, అరటిపళ్లు అవన్నీ ప్యాక్ చేసి బాక్సులు సిద్ధం చేసేవారు. తొలిరోజు షూటింగ్లో ఓ సహాయ దర్శకుడు భోజనం చేయలేదు. అదేంటి?` అని బాపు రమణలు ఆరా తీస్తే.. ”ఎవరెవరో కలిపి సిద్ధం చేస్తే నేనెందుకు తినాలి? వాళ్ల చేతులు శుభ్రంగా ఉన్నాయో, లేదో మనకెలా తెలుస్తుంది” అని నిరసన వ్యక్తం చేశాడు. ఆ సహాయ దర్శకుడి సందేహం సబబే అనిపించింది బాపు రమణలకు. ఒక్కరు ఆకలితో ఉన్నా – తమకు అవమానం అనుకుని మరుసటి రోజు నుంచీ అన్నం కూరలు విడివిగా వండి, వడ్డించేందుకు బల్లలు, కుర్చీలు, మండువాలూ తెప్పించారు. పూటకు నాలుగు కూరలు, పచ్చళ్లు, పిండివంటలతో.. హోరెత్తిపోయింది. ఒకేసారి అరవైమంది భోజనం ముగించేలా ఏర్పాట్లు చేశారు. రోజుకో మెనూ. మాంసాహారం ఇష్టపడేవాళ్లకు వేరుగా వంటవాళ్లు వచ్చి, కోరినవన్నీ వండేవారు.
రెండ్రోజుల తరవాత ఈ సంగతంతా.. అక్కినేనికి తెలిసింది. వెంటనే బాపు – రమణలకు పిలిపించారు. సెట్లో అందరి ముందే… క్లాసు పీకడం మొదలెట్టారు. ”మనం ఇక్కడికి పని చేయడానికి వచ్చాం, తిని తొంగోడానికి కాదు. భోజనాలు అయ్యాక పనిచేయాలా, వద్దా? నాలుగు మడతమంచాలూ తెప్పించండి, హాయిగా నిద్రపోతాం.. భోజనాలకు ఇంత ఖర్చయితే నిర్మాతలకు ఏం మిగులుతుంది? నాగేశ్వరావుతో సినిమా తీశాం, డబ్బులు పోగొట్టుకున్నాం? అన్న అపవాదు నాకు రావడానికా” అంటూ చడామడా తిట్టేశారు. ”రేపటి నుంచి నాలుగేసి కూరలొద్దు. ఖర్చు బాగా తగ్గించండి. అందరినీ ఒకేలా ట్రీట్ చేయండి. నాతో సహా” అంటూ ఆర్డరేశారు.
బాపు రమణలపై అక్కినేని నోరేసుకుని పడిపోవడంతో సెట్లో అంతా షాక్ తిన్నారు. అయితే ఆనక… బాపు రమణలకు మళ్లీ తన గదికి పిలిపించారు అక్కినేని. ”వాళ్లందరి ముందూ మీపై నోరు చేసుకున్నాను. కానీ.. తప్పలేదు. మీరిలా పెళ్లి భోజనం పెట్టుకుంటూ పోతే.. రేపు నాలుగు కూరలు కాస్త నలభై కూరలు అవుతాయి. నేను ఇలా అరిచాను కాబట్టి, వాళ్లూ పరిస్థితి అర్థం చేసుకుంటారు. ఖర్చు తగ్గిస్తే నిర్మాత బాగుపడతాడు. నన్నర్థం చేసుకోండి” అని వివరణ ఇచ్చుకున్నారు. అప్పటి నుంచీ భోజనాల ఖర్చు కాస్త అదుపులోకి వచ్చింది. కాకపోతే.. ‘అందాల రాముడు’ సెట్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇచ్చిన మర్యాద, గౌరవం, విందు.. తెలుగు సినీ చరిత్రలో మిగిలిపోతాయి.
(బాపు – రమణ ల గత ఇంటర్యూల సౌజన్యంతో )