ఈమధ్య తనయుల సినిమాలపై నాగార్జున కేరింగ్ మరీ మరీ ఎక్కువైంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాని నాగ్ బాగా ప్రమోట్ చేశారు. ప్రమోషన్‌తో ఆగలేదు.. ఆ సినిమా కథాకమామిషులోనూ జోక్యం చేసుకున్నారు. ఆ సినిమా అవుట్ పుట్ ఆరేంజులో వచ్చిందంటే కారణం… నాగార్జునే. ఇప్పుడు తన దృష్టి అఖిల్‌పై పడింది. తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ అఖిల్‌నే కాదు, నాగ్నీ చాలా బాధించింది. అందుకే రెండో సినిమా విషయంలో ఆయన కేరింగ్ మరింత ఎక్కువైంది. ఇంత వరకూ హిట్స్ తప్ప ఫ్లాపులు ఇవ్వని విక్రమ్ కె.కుమార్‌తో ఓ సేఫ్ జర్నీని అఖిల్ కోసం ప్లాన్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు పూర్తయి డిసెంబరు 22న విడుదల అవ్వబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసమే రాంగోపాల్ వర్మ తో సినిమా షూటింగ్‌ని కూడా వాయిదా వేసుకున్నాడు నాగ్. ఈ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పేశాడు కూడా. ”అఖిల్ సినిమా ప్రమోషన్లలో పాలుపంచుకోవాలి. అందుకే వర్మ సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇస్తున్నా. అఖిల్ సినిమా విడుదలైన తరవాత అప్పుడు మళ్లీ వర్మ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది” అని ఆనాడే సెలవిచ్చాడు నాగ్. అన్నట్టుగానే ఇప్పుడు ప్రమోషన్లకు రిబ్బన్ కట్ చేయబోతున్నాడు. రేపు (బుధవారం) నుంచి నాగ్ రంగంలోకి దిగబోతున్నాడు. ఇక వరుసగా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది.