చైనా యాప్‌లు నిషేధించడంతో ..వాటి డూప్‌లు తయారు చేయడంలోనూ కొంత మంది భారతీయ టెక్ నిపుణులు పోటీ పడుతున్నారు. ఆ యాప్‌ల స్థానాన్ని తాము కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో టిక్ టాక్ ను బ్యాన్ చేయగానే..అలాంటి యాప్‌లు అంటూ పదుల సంఖ్యలో వచ్చాయి. ఇప్పుడు…. ఆ స్థానంలోకి పబ్ జీ వచ్చింది. పబ్ జీ లాంటి వీడియో గేమ్‌ను తాను విడుదల చేస్తున్నట్లుగా… బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రకటించారు. దానిపేరు కూడా పబ్ జీని పోలి ఉండేలా.. పౌజీ అని పెట్టారు. అతి త్వరలోనే “ఫౌజీ” మల్టీ ప్లేయర్ గేమ్ యాప్ స్టోర్‌లోకి వస్తుందని అక్షయ్ చెబుతున్నారు.
అక్షయ్ కుమార్ బెంగళూరు కేంద్రంగా ఉన్న ఓ వీడియో గేమింగ్ తయారీ స్టార్టప్ కంపెనీలో వాటాదారుగా ఉన్నారు. తాను తీసుకొస్తున్న యాప్ ద్వారా కేవలం వినోదమే కాదు.. మన సైనికుల త్యాగాలను తెలియజేయబోతున్నామని…అలాగే గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం “భారత్‌కా వీర్ ట్రస్ట్”కు అందజేస్తామని కూడా ప్రకటించారు. ఇలా చైనా యాప్‌లను బ్యాన్ చేయడం…చైనా వస్తువుల నిషేధించడం వంటి వాటి ద్వారా.. అలాంటి వాటిని తయారు చేయడాన్ని ఆత్మనిర్భర్ గా చెప్పుకుంటూ వస్తున్నారు.
అక్షయ్ కూడా అదే చెబుతున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా ఫౌజీని తీసుకొస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే… అనుకరణలు ఎప్పటికీ అనుకరణలే కానీ..అసలైన వాటిని మించి పోవడం సాధ్యం కాదు. అందుకే.. ఇప్పటి వరకూ… ప్రముఖ యాప్‌లకు వచ్చిన అనుకరణలన్నీ తేలిపోయాయి. మరి పబ్ జీ ని ఎలిమినేట్ చేసేసి తీసుకు వస్తున్న ఫౌజీ ఎంత మేరకు క్లిక్ అవుతుందో చూడాలి..!