మా అభిమాన హీరో కరోనాపై పోరాటానికి రూ. పాతిక కోట్లు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో… ఆయా హీరోల అభిమానులు హంగామా చేస్తూంటారు. ఇలాంటి ఫేక్ పోస్టులు తరచూ వస్తూంటాయి. అయితే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి.. ఇలా ఓ పాతిక కోట్లు ఇస్తున్నట్లుగా ఎక్కడైనా పోస్టు కనిపిస్తే.. అది ఫేక్ కాదు. వర్జినల్. ఆయన తన సేవింగ్స్ నుంచి ఏకంగా రూ. పాతిక కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడాస్పందించారు. గ్రేట్ గెస్చర్ అని అభినందించారు. అదే సమయంలో.. టాటా ట్రస్ట్ అధిపతి..రతన్ టాటా… రూ. ఐదు వందల కోట్లను.. కరోనాను ఎదుర్కొనేందుకు ఫండ్‌గా ప్రకటించారు. ఈ మొత్తంతో ఆస్పత్రులకు కావాల్సిన వెంటిలేటర్లు ఇతర సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించారు.
బాలీవుడ్ నుంచి… ప్రధానంగా స్పందించి అక్షయ్ కుమార్ మాత్రమే. ఏకంగా రూ. పాతిక కోట్ల రూపాయలను ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. గత ఎన్నికల సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని అపొలిటికల్ ఇంటర్యూ చేసి.. కొన్ని ప్రశంసలు..మరెన్నో విమర్శలు అందుకున్నారు. ఆయనకు కెనడా పాస్‌పోర్టు ఉండటంతో ఓటు కూడా వేయలేకపోయారు. అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే.. సాయం చేయడంలో.. ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు. గతంలోనూ.. రైతులకు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్లో బడా బడా హీరోలు.. ప్రొడ్యూసర్లు ఉన్నా.. ఇంత వరకూ స్పందించలేదు.
టాలీవుడ్‌తో పాటు.. ఇతర సినీ రంగాల నుంచి పెద్ద ఎత్తున స్టార్లు.. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు..ఆయా రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు విరాళాలు ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్లే ఇంకా ప్రారంభించలేదు. బహుశా.. అక్షయ్ కుమార్ స్టార్ట్ చేశారు కాబట్టి.. ఇక వారిపై ఒత్తిడి పెరుగుతుందేమో చూడాలి. పీఎం కేర్స్ పేరుతో కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఓ ఫండ్ ప్రారంభించారు. ఎంత చిన్న మొత్తమైనా ఆ ఫండ్‌కు జమ చేయవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు.