జనసేన పార్టీకి ఒక్కో నేత గుడ్ బై చెబుతున్నారు. నిన్న చింతల పార్థసారధి అనే నేత … రాజీనామా చేసి నేరుగా వెళ్లి బీజేపీలో చేరిపోగా… ఇప్పుడు ఆ బాధ్యతను..మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తీసుకున్నారు. అయితే ఆయన తన పాత పార్టీ బీజేపీలోకి కాకుండా.. మంచి ఆఫర్ ఇచ్చిన వైసీపీలో చేరిపోతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా రాజమండ్రి సిటీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన ఆకుల సత్యనారాయణ… ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీతో పొత్తు లేకపోవడం.. ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో.. గెలుపు సాధ్యం కాదని నిర్ణయించుకుని… జనసేనలో చేరారు. ఆయన రాజమండ్రి పార్లమెంట్ సీటుకు పోటీ చేశారు కానీ.. ఫలితం దక్కలేదు. అప్పట్నుంచి జనసేన కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయనను… వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు.
మరో మాట లేకుండా.. ఆయన కూడా అంగీకారం తెలిపారు. ఎన్నికల తర్వాత జనసేనను పలువురు నేతలు వీడిపోతున్నారు. మొదటగా రావెల కిషోర్‌తో ఇది ప్రారంభమయింది. పవన్ కల్యాణ్ మంచివాళ్లని ఏరి కోరి టిక్కెట్లు ఇచ్చిన వారు కూడా.. వలసల బాట పడుతున్నారు. వీరిని నిలువరించేందుకు.. జనసేన పార్టీలో ఎలాంటి వ్యవస్థా లేకపోయింది. పోయేవారు పోవచ్చన్నట్లుగా.. పవన్ కల్యాణ్ తీరు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చింతల పార్థసారధి… మంచి విషయ పరిజ్ఞానం ఉన్న నేత. ఇటీవల నియమించిన కమిటీల్లో ఆయనకు ప్రాధాన్యం దక్కింది. అయినప్పటికీ.. ఆయన బీజేపీలో చేరిపోయారు.
జనసేన కార్యకలాపాలు… అంత చురుగ్గా లేకపోవడమే పార్థసారధి అసంతృప్తికి కారణమని చెబుతున్నారు. అదే సమయంలో.. పలువురు ఉత్సాహవంతులైన లీడర్లు ఉన్నప్పటికీ.. యాక్టివ్‌గా రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం లేదన్న అసంతృప్తి కొంత మంది నేతల్లో ఉంది. దీనికి తోడు.. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పనికొస్తారనుకున్న జనసేన నేతలను… పదవులు ఆశ పెట్టి.. పార్టీలోకి తీసుకునేందుకు అధికార పార్టీ రెడీగా ఉంది. దీంతో.. జనసేన నేతలు ఒక్కొక్కరు జారిపోతున్నారు.