మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా కడప జిల్లా నుంచి ఏరికోరి ఓ యంగ్ ఆఫీసర్ ను నియమించుకున్నారు. సమర్ధవంతమైన ఆఫీసర్ గా పేరు ఉండటంతో ఆకుల వెంకటరమణను ఓఎస్డీగా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో యువతకు ప్రాధాన్యత దక్కడం వెనక లోకేష్ ఉన్నారనే మాటలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయన ఓఎస్డీ ఎంపిక కూడా ఆ దిశగానే సాగిందని తెలుస్తోంది.
ఆకుల వెంకటరమణను నారా లోకేష్ తన ఓఎస్డీగా నియమించుకున్నారు అంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఆకుల వెంకట రమణ…ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన శ్రీరాములు – లక్ష్మీనరసమ్మల కుమారుడు. వెంకటరమణది సాధారణ మధ్య తరగతి కుటుంబం. మొదటి నుంచి చదువులో చురుకుగా ఉండే వెంకటరమణ బీటెక్ పూర్తయ్యాక ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థలో సర్క్యూట్ డిజైనర్ ఇంజినీర్ గా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించారు.
Also Read : నేతలకు కీలక ఆదేశాలు..చంద్రబాబు మరో కీలక నిర్ణయం
ఏపీపీఎస్సీ గ్రూప్-1 కు మొదటి సారిగా 2011లో హాజరుకాగా, ఇంటర్వూ వరకూ వెళ్లారు. కానీ అది రద్దైంది. అనంతరం 2012లో రీ ఎగ్జామినేషన్ నిర్వహించగా..అందులో వెంకటరమణ టాపర్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా పని చేసిన ఆయన..గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో తనదైన మార్క్ వేశారు. అందుకుగాను ప్రభుత్వం చేత అభినందనలు అందుకున్నారు.
అనంతరం అక్కడి నుంచి కడప జిల్లా బద్వేల్ కు ఆర్డీవోగా బదిలీపై వెళ్ళారు. అక్కడ కూడా సమర్ధవంతమైన అధికారిగా పేరు సంపాదించారు.ఈ నేపథ్యంలో సమర్ధవంతమైన యువ ఆఫీసర్ల వెతుకులాటలో ఉన్న లోకేష్ ను వెంకటరమణ ప్రొఫైల్ ఆకట్టుకుంది. దీంతో ఈ యువ ఆఫీసర్ ను లోకేష్ తన ఓఎస్డీగా నియమించుకున్నారు.