డ్రగ్స్ కేసు విచారణ తీరుపై కొన్ని విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం కొన్ని వర్గాలనే టార్గెట్ చేస్తూ… అసలు నేరగాళ్లను వదిలేస్తున్నారంటూ కొన్ని రాజకీయ పార్టీలు కూడా విమర్శలు గుప్పిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ విమర్శలపై స్పందించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇంతవరకూ 25 మందిని విచారించామని చెప్పారు. వారిలో సినీ పరిశ్రమకు చెందినవారు ఐదుగురే అన్నారు. సిట్ పై తప్పుడు ప్రచారం ఆపకపోతే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తామని కూడా అకున్ హెచ్చరించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కు లోబడే విచారణ జరుగుతోందన్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలకు కూడా వెసులుబాటు ఇచ్చామనీ, ఎక్కడ కావాలంటే అక్కడే క్వశ్చనింగ్ చేస్తామని చెప్పామన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు సిట్ కార్యాలయానికే వస్తానని చెప్పారన్నారు.
విచారణ సజావుగా సాగుతోందనీ, ఎవ్వరిన్నీ బలవంతపెట్టడం లేదని అన్నారు. మంచి గదిలో, మంచి వాతావరణం కల్పించామనీ, విచారణ క్రమం అంతా వీడియో తీస్తున్నామనీ, విచారణ పూర్తయిన వెంటనే సదరు వీడియోని సీల్ చేస్తున్నామనీ, తరువాత వాటిని కోర్టుకు సమర్పిస్తామని అకున్ చెప్పారు. విచారణ జరుగుతున్న సమయంలో ప్రతీ 8 గంటలకు ఒకసారి ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలన్నా కూడా వెంటనే చేసేందుకు వైద్యుల్ని అందుబాటులో ఉంచుతున్నాం అన్నారు. విచారణకు వస్తున్నవారిలో ఎవ్వరి నుంచీ బలవంతంగా ఎలాంటి శాంపిల్స్ తీసుకోవడం లేదన్నారు. నిన్నటి వరకూ ఇద్దరి నుంచీ రక్త నమూనాలు, జుత్తు, గోళ్ల నమూనాలు సేకరించామన్నారు. అయితే, అది కూడా వాళ్లు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపిన తరువాతే తీసుకున్నామన్నారు. డ్రగ్స్ కేసు డైరీలో ఏముందో తెలియకుండా కొంతమంది లేనిపోని విమర్శలు చేయడం సరికాదన్నారు. విచారణలో లోపాలున్నాయంటూ వినిపిస్తున్న వ్యాఖ్యలపై కూడా సీరియస్ అయ్యారు. ఈ ధోరణి శృతి మించితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాల్సి ఉంటుందంటూ అకున్ హెచ్చరించడం విశేషం!
నిజానికి, డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఎవరి ప్రజెంటేషన్ వారిది అన్నట్టుగా ఉంది. విచారణకు హాజరైనవారిని సిట్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందనీ, ప్రశ్నల వర్షం కురిపించేస్తోందనీ, విచారణకు హాజరైన వారిని అధికారులు గడగడ లాడిస్తున్నారనీ, నిజాలు కక్కిస్తున్నారనీ… ఇలా చాలా రకాల కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అకున్ చేసిన హెచ్చరికలు కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు.