ఆకునూరి మురళి అనే .. తెలంగాణ ఐఏఎస్ అధికారి… తనకు పని ఉన్న పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసి.. స్వచ్చందంగా రాజీనామా చేశారు. అయితే.. తెలంగాణకు ఆయన చేసిన సేవల్ని… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే గుర్తించారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో ఓ సలహాదారు పదవిని ప్రకటించేశారు. సలహాదారులందరికీ సహజంగా.. కేబినెట్ హోదా తో పాటు.. దానికి తగ్గట్లుగా జీతభత్యాలు ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే.. ఓ జిల్లాకు కలెక్టర్‌గా.. ఆకునూరి మురళి పోస్టింగ్ పొందారు. అయితే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు ఆయన… కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత.. కొంత మంది ఐఏఎస్‌లతో.. ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి.. తెలంగాణ సర్కార్‌పై.. దళిత అధికారులపై వివక్ష ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు చేశారు.
ముఖ్యంగా తెలంగాణ స్థానికత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐఏఎస్ అధికారులతో ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇరవై మంది అధికారులు ఈ గ్రూప్‌లో ఉన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం ఏర్పాటుకు అప్పట్లో ప్రయత్నాలు కూడా చేశారు. తమకు గుమస్తాల్లాంటి పోస్టులు ఇచ్చి రిటైర్ అయిన వాళ్లను కూడా తీసుకొచ్చి ప్రాధాన్య పోస్టులు ఇస్తున్నారన్న అసహనం.. తెలంగాణ బలహీన వర్గాల ఐఏఎస్ అధికారుల్లో ఉందని దాన్ని.. బయటకు తెచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. దాంతో.. సహజంగానే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రాధాన్య పోస్టులు దక్కలేదు.
ఆయనను ఆర్కైవ్స్ విభాగంలో నియమించడంతో… పని లేకుండా పోయింది. దీంతో.. పదవీకాలం మరో ఏడాది ఉండగానే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల తర్వాత ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇప్పుడు ఆయనను అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆదరించడం ఆసక్తి కలిగించే పరిణామం. తెలంగాణకు చెందిన ఆయనను తీసుకొచ్చి… ఏపీలో సలహాదారుగా నియమించడం వెనుక అసలు కారణమేమిటో అని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ కోసం పోరాడిన వారిని .. జగన్ ఇష్టంగా.. సలహాదారు పదవులు ఇవ్వడం వెనుక అసలు కారణం ఏమిటన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.