తెలుగు360 రేటింగ్ 3.25/5
కాంబినేషన్లకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఇక హిట్లున్న దర్శకుడు – కథానాయకుడు కలిశారంటే ఇక అంచనాలు మరింతగా పెరిగిపోతుంటాయి. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా అనగానే ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. బన్నీ గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. త్రివిక్రమ్ `అరవింద సమేత` తర్వాత చేసిన తన మార్క్ కుటుంబ కథా చిత్రం. సంక్రాంతి సందడిలో భాగంగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ
రామచంద్ర (జయరామ్), వాల్మీకి (మురళీశర్మ) ఒకేసారి ఉద్యోగంలో చేరుతారు. కలిసి రావడంతో రామచంద్ర తాను పనిచేసే కార్యాలయానికి సీఈఓ అవుతాడు, ఆ తర్వాత ఆ కంపెనీ అధిపతి (సచిన్ ఖేడ్కర్)కి అల్లుడు అవుతాడు. వాల్మీకి మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా చిన్న ఉద్యోగిగానే ఆ ఇంట్లో పనిచేస్తుంటాడు. దాంతో ఈర్ష్య పెంచుకున్న వాల్మీకి తనకి పుట్టిన బాబుని రామచంద్ర ఇల్లు (వైకుంఠపురం)లో పెరిగేలా, అక్కడ పుట్టిన బాబుని తన ఇంట్లో పెరిగేలా తారుమారు చేస్తాడు. దాంతో పెద్దింటి అబ్బాయి కాస్త బంటు (అల్లు అర్జున్)గా వాల్మీకి ఇంట్లో పెరుగుతాడు. వాల్మీకికి పుట్టిన అబ్బాయి మాత్రం రాజ్ మనోహర్ (సుశాంత్)గా పెద్దింటికి వెళ్లిపోతాడు. 20 యేళ్ల తర్వాత ఆ పెద్దింట్లో చాలా సమస్యలు ఏర్పడతాయి. అదే సమయంలో తన నిజమైన అమ్మానాన్నలు ఆ ఇంట్లో ఉన్నారనే విషయం బంటుకి తెలుస్తుంది. దాంతో వైకుంఠపురములోకి అడుగు పెడతాడు బంటు. అక్కడున్న సమస్యల్ని ఎలా పరిష్కరించాడన్నదే సినిమా.
విశ్లేషణ
పాతికేళ్ల కిందట దూరమైన అత్త కోసం హీరో విదేశాల నుంచి వస్తాడు. సమస్యలతో సతమతమవుతున్న అత్తకి సాయం చేసి… ఆమె మనసు మార్చి తనతో పాటే తీసుకెళతాడు. బిడ్డని దూరం చేసుకుని కుమిలిపోతున్న తాత కళ్లల్లో ఆనందం చూస్తాడు. అదే.. `అత్తారింటికి దారేది` అయ్యింది. తనని కన్న అమ్మానాన్నలు సమస్యల్లో ఉన్నారని తెలిసినా ఆ ఇంటికి వెళ్లే దారిలేక సతమతమవుతూ.. చివరికి ఆ దారి వెతుక్కుని అక్కడికి వెళతాడు. సమస్యలన్నింటినీ తెలుసుకుని, ఆ ఇంటి వారసుడిగా తానేం ఏం చేయాలో అది చేస్తాడు. అదే… `అల వైకుంఠపురములో`. కథ చిన్నదే. కానీ ఎప్పట్లాగే త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ, భావోద్వేగాలతో చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సున్నితమైన కథ కావడం, కథనం పరంగా కూడా ఎక్కువ మేజిక్కులు చేసే ఆస్కారం లేకపోవడంతో అక్కడక్కడా సినిమా వేగం తగ్గిపోతుంటుంది. సన్నివేశాలు మరీ సాగదీతగా అనిపిస్తుంటాయి. అలాంటి భావం కలిగేలోపే దర్శకుడు తన మార్క్ రచనతో బండి సాఫీగా నడిచేలా చేస్తాడు. చిన్నారుల తారుమారు నుంచి కథ మొదలవుతుంది. బంటు మధ్యతరగతి కష్టాల్ని చూపిస్తూ ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. అమూల్య (పూజాహెగ్డే) కంపెనీలో ఉద్యోగిగా చేరడం, అక్కడ్నుంచి ఆ కంపెనీని సొంతం చేసుకోవాలని మరొకరు ప్రయత్నించడం, దాన్ని కథానాయకుడు అడ్డుకోవడం నుంచి కథ వేగం అందుకుంటుంది. కానీ అసలు డ్రామా బంటుకి తానెవరి బిడ్డో తెలియడం, ఆ తర్వాత వైకుంఠపురములోకి అడుగుపెట్టడం నుంచి మొదలవుతుంది. రామచంద్ర కంపెనీలోకి ప్రవేశించాలని చూస్తున్న అప్పలనాయుడు (సముద్రఖని)ని తన శక్తియుక్తులతో నిలువరించడం, అమ్మానాన్నల మధ్య పొరపచ్ఛాల్ని తొలగించడం ద్వితీయార్థంలో హైలెట్‌గా నిలిచాయి. పతాక సన్నివేశాలు మామూలే. కానీ వాటికి శ్రీకాకుళం పాటతో టచ్ ఇచ్చి మాస్‌ని మెప్పించే ప్రయత్నం చేశారు. త్రివిక్రమ్ మార్క్ ఫన్ ఉంటుంది కానీ, అది మరీ కడుపుబ్బా నవ్వుకునే స్థాయిలో ఉండదు. హీరోయిన్ పొట్టి డ్రెస్సుని చూడటం మొదలుకొని.. ద్వితీయార్థంలో మెడ్లీ వరకు సన్నివేశాల్లో భాగంగా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. బుట్టబొమ్మ పాట చిత్రీకరణ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. సామజవరగమన పాటని ప్యారిస్‌లో చిత్రీకరించినా… ఆ పాటకి లభించిన ఆదరణ స్థాయి మాత్రం తెరపై కనిపించలేదు. రాములో రాములా పాట మాస్‌ని అలరిస్తుంది.
నటీనటులు
అల్లు అర్జున్ గ్యాప్ తర్వాత నటించినా.. ఇందులోని పాత్రకి ఈజ్‌ని మాత్రం పర్ఫెక్ట్గా జోడించాడు. అతనికి టైలర్ మేడ్ పాత్ర దొరికినట్టుగా అందులో ఒదిగిపోయాడు. సున్నితమైన హాస్యం పండిస్తూనే, యాక్షన్, డ్యాన్సుల్లో తన మార్క్‌ని ప్రదర్శించాడు. పూజా హెగ్డే అందంతో కట్టిపడేస్తుంది. నటన పరంగా ఆమెకి పెద్దగా అవకాశం లభించలేదు. సుశాంత్ కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. నివేతా పాత్ర గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు. మురళీశర్మ ఈర్ష్య, మధ్య తరగతి జీవితాన్ని మేళవించిన పాత్రని పోషించాడు. జయరామ్, టబులు పాత్రల పరిధికి తగ్గట్టుగా చాలా బాగా నటించారు. సముద్రఖని, అజయ్ ప్రతినాయకులుగా కనిపించారు. సముద్రఖని విలన్‌గా బాగా నటించాడు. కానీ ఇందులో విలనిజం పెద్దగా పండలేదు.
సాంకేతిక వర్గం
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుది. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం, తమన్ సంగీతం ఆకట్టుకుంటుంది. త్రివిక్రమ్ తనకి అలవాటైన కుటుంబం, సెటప్ నేపథ్యంలోనే ఈ సినిమాని తీశాడు. చాలాచోట్ల ఆయన మార్క్ సంభాషణలు వినిపిస్తాయి.
ఫినిషింగ్ టచ్: పులే వచ్చింది
తెలుగు360 రేటింగ్ 3.25/5