అల వైకుంఠ‌పుర‌ములో టీజ‌ర్‌: స్టైల్‌గా ఉంది క‌దా..?!

అల్లు అర్జున్ అంటే స్టైల్‌కి ప‌ర్యాయప‌దం… సినిమాల్ని స్టైలీష్‌గా తీయ‌డంలో త్రివిక్ర‌మ్ రూటే వేరు. ఇద్ద‌రూ క‌లిస్తే.. ఎలా ఉంటుందో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో తెలిసిపోయింది. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి త‌మ స్టైల్ చూపించ‌బోతున్నారు….. అల వైకుంఠ‌పుర‌ముతో. సంక్రాంతికి విడుద‌ల అవుతున్న సినిమా ఇది. ఇప్పుడు టీజ‌ర్ బ‌యట‌కు వ‌చ్చింది

త్రివిక్ర‌మ్, బ‌న్నీ సినిమాల నుంచి ఏం ఆశిస్తారో అవ‌న్నీ రంగ‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది. హీరోయిజం, ఫ్యామిలీ బాండింగ్‌, డైలాగులూ ఇవ‌న్నీ 83 సెక‌న్ల టీజ‌ర్‌లోనే చూపించేయాల‌నుకున్నారు.

మీనాన్న పెళ్లి కూతుర్ని దాచిన‌ట్టు దాచాడు నిన్ను.. అనే డైలాగ్‌తో టీజ‌ర్ మొద‌లైంది. బ‌న్నీ స్టైల్‌, మిడిల్ క్లాస్ లుక్, మేడ‌మ్ సార్ అంటూ హీరోయిన్‌ని సంబోధించ‌డం – ఇవ‌న్నీ ఆక‌ట్టుకునేవే. త్రివిక్ర‌మ్ సినిమాల్లో మంచి విజువ‌ల్స్ ఉంటాయి. ఆ మార్క్ ప్ర‌తి ఫ్రేములోనూ క‌నిపించింది. దానికి తోడు.. త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హాయిగా ఉంది. ప్ర‌తి చిన్న క్యారెక్ట‌ర్‌కీ పేరున్న న‌టుల‌నే తీసుకోవ‌డం వ‌ల్ల తెర‌కు నిండుద‌నం వ‌చ్చింది.

త్రివిక్ర‌మ్ సినిమా టీజ‌ర్‌లో లాస్ట్ పంచ్ ఎప్పుడూ అదిరిపోతుంది. మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్ట‌ర్ ఎక్కా..! అనే బ‌న్నీ డైలాగ్ ఫైన‌ల్ పంచ్ అయ్యింది. అయితే… ఈ డైలాగ్ ఎంత‌మందికి ఎక్కుతుందో చూడాలి.

కాక‌పోతే కొన్ని చోట్ల అత్తారింటికి దారేది, అజ్ఞాత‌వాసి రిఫ‌రెన్సులు పుష్క‌లంగా క‌నిపిస్తుంటాయి. ఇంటి ముందు ఆగి.. నేమ్ బోర్డు వంక ప్రేమ‌గా చూడ‌డం, ఆఫీసు వ్య‌వ‌హారాలు ఇవ‌న్నీ త్రివిక్ర‌మ్ పాత సినిమాల ఫ్రేమింగులు. అల వైకుంఠ‌పుర‌ములో అనేది ఊరు పేరు కాద‌ని, ఇంటి పేర‌ని గ‌ట్టిగా క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి వ‌స్తున్న సినిమా క‌దా. అందుకే కోడి పుంజు చేతిలో ప‌ట్టుకుని – ఫైన‌ల్ ట‌చ్ ఇచ్చాడు.

మొత్తానికి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే, భారీగా, క్లాసిక‌ల్‌గా సాగింది టీజ‌ర్‌. ఇదే ఊపూ, స్కోపూ తెర‌పై ఉంటే సంక్రాంతి హిట్టు బ‌న్నీ ఖాతాలో ప‌డే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.