తమిళ రాజకీయ దిగ్గజం, డీఎంకే అధినేత కరుణానిధి మరణించాక… ఊహించినట్టుగానే వారసుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది! కలైంజర్ కు స్టాలిన్ ఒక్కరే అసలైన రాజకీయ వారసులు అంటూ అభిమానులు ఓ పక్క అభిప్రాయపడుతుంటే… కాదు, నిఖార్సైన వారసత్వం తనదే అంటూ మరో కుమారుడు అళగిరి వ్యాఖ్యానించడం ఇప్పుడు తమిళనాట చర్చనీయంగా మారింది. డీఎంకేకి స్టాలిన్ నాయకత్వం పనికిరాదనీ, తానే సరైన నాయకుడననీ, కాబట్టి అందరూ తనకే మద్దతు ఇవ్వాలనీ, ఇప్పటికే తన వెంట చాలామంది ఉన్నారని అళగరి ప్రకటించారు! దీంతో డీఎంకే వర్గాల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంటోందని చెప్పొచ్చు.
నిజానికి, స్టాలిన్ తో పోల్చుకుంటే సోదరుడు అళగిరికి పెద్దగా ప్రాధాన్యత లేదు. 2014లోనే ఆయన్ని పార్టీ నుంచి స్వయంగా కరుణానిధి బహిష్కరించారు. పార్టీలో ఉండగా ఆయన రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి వచ్చింది. దాంతో కొన్నాళ్లుగా రాజకీయంగా క్రియాశీలకంగా ఆయన లేరు. అయితే, ఇప్పుడు కరుణానిధి మరణంతో డీఎంకే వారసుడనని అంటున్నారు. నిజానికి, డీఎంకే వర్గాల్లో కూడా అళగిరికి ఏమంత గుర్తింపు లేదనే అంటున్నారు. మదురై చుట్టుపక్కల ఓ రెండు మూడు జిల్లాల్లో మాత్రమే అళగిరికి కొంత పట్టుందని చెబుతున్నారు. తమ్ముడు స్టాలిన్ కి అధికారం దక్కుతుందన్న చూపోర్చని బుద్ధితోనే అళగిరి రాజకీయం చేస్తున్నారంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే, కొంతమందిని వెంటేసుకుని పార్టీని చీలుస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లో అళగిరి టచ్ లో ఉన్నారని స్టాలిన్ వర్గంలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా గొడవ పెంచుకుని, కొంత ప్రాధాన్యత ఉందని చాటుకుంటూ రజనీ పార్టీలో చేరతారని అంటున్నారు. అళగిరి భాజపా మనిషి అంటూ స్టాలిన్ వర్గం పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టిందని సమాచారం. ఇక, కరుణానిధి మూడో భార్య కుమార్తె కనిమొళి మద్దతు ఈ ఇద్దరిలో ఎవరి వైపు ఉంటుందనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అయితే, తండ్రి అడుగుజాడల్లో స్టాలిన్ నడిచారు. దాదాపు నలభైయ్యేళ్లుగా కలైంజర్ నాయకత్వానికి గౌరవిస్తూనే ఈయన రాజకీయాల్లో ఉన్నారు. డీఎంకేని స్టాలిన్ నడిపించాలన్నది కూడా కరుణానిధి కోరిక. కాబట్టి, తండ్రి కోరికను కనిమొళి గౌరవిస్తారనీ, స్టాలిన్ వెంటే ఉంటారని ఆ వర్గం అభిప్రాయపడుతోంది. ఓపక్క, జయలలిత మరణంలో అన్నాడీఎంకేలో కూడా సరైన నాయకత్వం లేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కరుణానిధి మరణంతో డీఎంకేలో వర్గపోరు మొదలౌతున్నట్టుగా ఉంది.