తమిళనాడులో సాధారణంగా రాజకీయాలు రెండు పార్టీల చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రస్తుతం అధికారంలో అన్నాడిఎంకె, ఒకప్పుడు అధికారంలో ఉన్న డిఎంకె పార్టీలు. తమిళనాడులో ప్రజలు ఆ రెండు పార్టీలకే మార్చి మార్చి అధికారం కట్టబెడుతుంటారు. ప్రతిపక్ష డిఎంకె పార్టీ అధినేత కరుణానిధి వృదాప్యం కారణంగా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టలేకపోవడంతో ఆయన కొడుకులిద్దరూ అళగిరి, స్టాలిన్ పార్టీపై పట్టుకోసం గొడవ పడ్డారు. వారి గొడవలు రచ్చకెక్కడంతో చిన్న కొడుకు స్టాలిన్ తన రాజకీయ వారసుడని కరుణానిధి ప్రకటించడంతో పెద్దవాడయిన అళగిరి అలిగి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగి సుమారు మూడేళ్ళు కావస్తోంది.
ఆ తరువాత డిఎంకె పార్టీని బలోపేతం చేయడానికి స్టాలిన్ చాలా కృషి చేసారు కానీ పెద్దగా ఫలితం కనబడలేదు. అలాగే పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి పరిస్థితి కూడా అయోమయంగా మారింది. అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకి వెళ్ళినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె చాలా బలహీనంగా ఉండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని లబ్ది పొందలేకపోయింది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో దక్షిణాది జిల్లాలలో పార్టీ చాలా బలహీనంగా ఉన్నట్లు తెలిసింది.
ఈ ఏడాది మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అళగిరిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని కరుణానిధి కుటుంబ సభ్యులు, పార్టీలో కొందరు సీనియర్ నేతలు గట్టిగా పట్టుబట్టడంతో కరుణానిధి అందుకు అంగీకరించారు. స్టాలిన్ అందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తునప్పటికీ, కుటుంబ సభ్యుల ఒత్తిడి, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అయిష్టంగానే అందుకు అంగీకరించారు. అళగిరి కూడా పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సిద్దంగానే ఉన్నారు . కనుక త్వరలోనే ఆయన తండ్రిని కలిసి డిఎంకెలో చేరబోతున్నారని తాజా సమాచారం.