టీవీ9 కొనుగోలు వివాదం.. కొత్త మలుపులు తిరుగుతోంది. అత్యంత అవమానకరంగా బయటకు పంపేయడమే కాకుండా.. కేసులు పెట్టి.. జైలుకు పంపే ప్రయత్నం కూడా చేస్తూండంటంతో.. ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాష్.. తనకు తెలిసిన అక్రమాల సమాచారాన్ని మొత్తం… బయట పెట్టాలని డిసైడయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మీడియా ముందు ఆరోపణలు చేయకుండా.. రికార్డెడ్‌గా ఉండేందుకు.. నేరుగా కోర్టులోనే చేస్తున్నారు. దాంతో.. ఈ వివాదం కొత్త మలుపు తిరిగినట్లవుతోంది.
కోర్టులో రవిప్రకాష్ ఆరోపణలు – టీవీ9లో రచ్చ..!
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జరుగుతున్న వాదనల్లో… టీవీ9 మాజీ సీఈవో.. రవిప్రకాష్.. సంచలన ఆరోపణలు చేశారు. అసలు టీవీ 9 పుట్టిందే హవాలా సొమ్ము ద్వారా అని.. అమ్మకం కూడా అలాగే జరిగిందని.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు ఎలా… చేతులు మారాయో కూడా.. ఆయన వివరించారు. దాంతో… ఒక్క సారిగా.. ఈ కేసు విచారణ మలుపు తిరిగినట్లయింది. రవిప్రకాష్ కోర్టులో చేసిన ఆరోపణలపై… టీవీ9 చానల్ ద్వారా… అలంద మీడియా, ఏబీసీఎల్ సంస్థలు .. స్పందించాయి. రవిప్రకాష్‌పై చర్యలు తీసుకుంటానికి సిద్ధమయ్యామంటూ… ప్రకటించారు. టీవీ9 స్థాపించినప్పుడు.. అమ్మకపు లావాదేవీలు జరిగినప్పుడు కూడా రవిప్రకాష్ సీఈవోనేనని.. ఆ సంస్థలు గుర్తు చేశాయి. రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారమే.. లావాదేవీలు జరిపామని ప్రకటించారు. అయితే.. రవిప్రకాష్ బహిరంగంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదు కోర్టులోనే చెప్పారు. అలాంటిది.. అలంద, ఏబీసీఎల్ మాత్రం… బయట మీడియాలో ఎందుకు హడావుడి చేస్తున్నాయో.. చాలా మంది ప్రేక్షకులకు కూడా అర్థం కావడం లేదు.
ఆ ఆరోపణలు నిజం అయితే రవిప్రకాష్ కూడా ఇరుక్కుంటారుగా..!?
నిజానికి రవిప్రకాష్.. హైకోర్టు లోపల చేసిన ఆరోపణలు నిజం అయితే.. ఆయన కూడా ఇరుక్కుంటారు. ఎందుకంటే.. ఆ సంస్థలో ఇప్పటికీ ఆయనకు వాటా ఉంది. అంతే.. కాదు.. అసలు టీవీ9కి కర్త, కర్మ, క్రియ. మొదటి నుంచి.. మొన్న బలవంతంగా.. పంపించేసే వరకూ.. ఆయనే సీఈవో. టీవీ9 వేసిన ప్రతి అడుగులోనూ.. ఆయన ముద్ర ముంది. హవాలా సొమ్ము పెట్టుబడులుగా వచ్చినా… అమ్మకం విషయంలో హవాలా లావాదేవీలు జరిగినా.. ఆయనకూ పాత్ర ఉంది. అదే విషయాన్ని అలంద మీడియా, ఏబీసీఎల్ తెలిపాయి. సీఈవోగా.. ఆయన సంతకం చేసిన తర్వాతే లావాదేవీలు పూర్తయ్యాయని గుర్తు చేసింది. ఈ మాత్రం తెలియని వ్యక్తి రవిప్రకాష్ కాదుగా..! అయినా సరే.. తను ఇరుక్కుపోయినా సరే… తన పంతం నెగ్గించుకోవాలని రవిప్రకాష్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తం వ్యవహారంపై విచారణ జరుగుతోందా..?
నిజానికి టీవీ9 సంస్థను ఎప్పటి నుండో అమ్మాలనుకుంటున్నారు. కారణం తెలియదు కానీ.. ఎప్పటికప్పుడు.. పెండింగ్ పడిపోయింది. చివరికి రూ. 400 కోట్ల పైచిలుకు మొత్తానికి 90 శాతానికిపైగా వాటాలను… జూపల్లి రామేశ్వరర్ రావు, మేఘాకృష్ణారెడ్డి కొనుగోలు చేశారని ప్రచారం జరిగినప్పుడు.. చాలా మంది ఆశ్చర్యపోయారు. టీవీ9 ఒక్క తెలుగులోనే కాదు.. కన్నడ, గుజరాతీల్లో కూడా నెంబర్ వన్ చానల్. ఇంగ్లిష్ చానల్ కూడా ఉంది. అత్యధిక వ్యూయర్ షిప్ ఉన్న చానళ్లు. ఇలాంటి చానళ్లను గతంలో కొనుగోలు చేసినప్పుడు… రూ. 2వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈటీవీ చానల్స్ , మాటీవీ చానల్స్ కొనుగోలు చేసినప్పుడు.. ఒప్పందాల విలువ రూ. రెండువేల కోట్లపైమాటే. అలాంటిది… టీవీ9కి అంత తక్కువ విలువేంటి … అనుకున్నారు. అయితే.. అది సాధారణ ప్రజల అనుమానం. అమ్మకం దారుడు.. కొనుగోలుదారులకు మధ్య వ్యవహారం కాబట్టి.. కార్పొరేట్ వర్గాలూ.. పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రవిప్రకాష్ ఆరోపణలతో కొత్త చర్చ ప్రారంభమయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మీడియాలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు రాకూడదో.. అలాంటి పరిణామాలు ఇప్పుడు టీవీ9 అమ్మకం వివాదంలో నడుస్తోంది. దీనిపై … పూర్తి విచారణ జరిపితేనే కానీ వాస్తలు బయటపడే పరిస్థితి లేదన్న అభిప్రాయం.. మీడియా వర్గాల్లో వ్యక్తమవుతోంది. అప్పుడే మీడియాకు మిగిలి ఉన్న విశ్వసనీయత ఉంటుందంటున్నారు. ఏది ఏమైనా టీవీ9 పుట్టుక… నడక.. ఎంత సంచలనం అయిందో.. ఇప్పుడు.. పతనం కూడా అలాగే ఉంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.