తెలంగాణలో మందుబాబుల అగచాట్లను.. ఆర్థిక ఇబ్బందులను కేసీఆర్ గుర్తించారు. రాత్రికి రాత్రి మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫుల్ బాటిల్ పై రూ. నలభై వరకూ తగ్గించారు. బీర్ ధరలను తగ్గించలేదు. హఠాత్తుగా ఇలా మధ్యం ధరలను తగ్గించడానికి కారణం ఏమిటంటే..అమ్మకాలు పడిపోవడమే. అమ్మకాలు పడిపోవడంతో..ఆదాయం తగ్గిపోయింది. దీంతో కార్పొరేట్ కంపెనీలు పాటించే ధరల తగ్గింపు- అమ్మకాల పెంపు సూత్రాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయానికి లోటు లేదు. హైదరాబాద్ సిటీ మహారాజ పోషకురాలిగా ఉంది. అన్ని రకాల పన్నుల ఆదాయం పెరుగుతోంది. కానీ ఆదాయానికి మించి ఖర్చు పెట్టేసే చర్యలు తీసుకోవడం.. నిర్ణయాలు ఎక్కువగా దుబారా కావడంతో పరిస్థితి జఠిలంగా మారుతోంది. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఇంకా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.దీంతో మద్యం ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ సారి ఎన్నికల్లో మద్యం హవా ఎలా ఉండబోతోందో మునుగోడు ఎన్నికలతో క్లారిటీ వచ్చింది. ఒక్క నియోజకవర్గంలోనే రూ. మూడు వందల కోట్ల మధ్యం అధికారికంగా అమ్ముడయింది. అనధికారికంగా ఇంకా ఎంత పారిందో చెప్పడం కష్టం. అందుకే ధరలు తగ్గిస్తే అమ్మకాలు జూమ్ అవుతాయన్న గట్టి నమ్మకంతో నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఇటీవలి కాలంలో ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో అమ్మకాలు తగ్గాయి. ఇప్పుడు తగ్గింపుతో వాటిని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు.