వైరస్ వ్యాపిస్తోంది..! ఉపాధి కరువయింది..! ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలియడం లేదు..! లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో అంచనా లేదు..! ఇన్ని గోలల మధ్య… ఒక్క టాపిక్ మాత్రం… హైలెట్ అయిపోతోంది. అదే మద్యం అమ్మకాలకు అనుమతించడం. కేంద్రం మద్యం అమ్ముకునేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అనుమతిలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరు. కొద్ది రోజులుగా కేంద్రంపై మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలంటూ తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిధులు కావాలంటూ అడగడం ప్రారంభించారు. వారి ఒత్తిడి తట్టుకోలేక కేంద్రం.. మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. భౌతిక దూరం.. సహా ఇతర నిబంధనలను దుకాణాల వద్ద పాటించాలని ఆదేశించింది.
మామూలు రోజుల్లోనే… మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయి ఉంటాయి. దాదాపుగా నెలన్నర తర్వాత దుకాణాలు తెరిస్తే… పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ఆ ఊపు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. బయట కూడా కనిపిస్తోంది. మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తున్నారు..? ఎక్కడెక్కడ తెరుస్తున్నారు..? మీది ఏ జోన్ అంటూ.. చర్చలు ప్రారంభించేశారు. మందుబాబుల హడావుడి చూసి.. సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడుతున్నాయి. ప్రభుత్వం.. ఉపాధి పెంచే పనులను యుద్ధ ప్రాతిపదికన చేయలేదు కానీ.. మద్యం అమ్మకాలకు మాత్రం.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
సోమవారం నుంచే పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సోమవారమే ఓపెన్ చేసే అవకాశం ఉంది. అక్కడ డిస్టిలరీల్లో తయారీకి అనుమతులు ఇచ్చేశారు. ఆ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే నిల్వ ఉన్న స్టాక్‌తో అమ్మకాలకు ఇబ్బంది ఉండదు. ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి .. కేంద్ర నిర్ణయం ఊరటనిచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సర్కార్ కూడా.. ఐదో తేదీన కేబినెట్ భేటీలో మద్యం దుకాణాల ఓపెనింగ్ కు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మిగతా సమస్యలన్నీ.. మద్యంతాగితే మర్చిపోవచ్చనేది..మందుబాబుల ధీయరి. బహుశా.. అందుకే.. ఇలా.. మద్యం కోసం వెంపర్లాడుతున్నారేమో..?