ఓటీటీ అనుకోండి.. పైరసీ పై పడండి.. మంచి సినిమాలు రావడం లేదనండి.. లేదంటే.. టికెట్ల రేట్లు పెరిగిపోయాయని నింద వేయండి. ఏదైనా సరే, థియేటర్ల ఆక్యుపెన్సీ బాగా తగ్గింది. స్టార్ హీరో సినిమా వస్తేనో, బొమ్మ సూపర్ అనే టాక్ వినిపిస్తేనో.. జనాలు థియేటర్ల వంక చూస్తున్నారు. లేదంటే.. థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో `పెద్ద తలకాయల`ంతా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూహాలు పన్నుతున్నారు. అందరి టార్గెట్ జనాల్ని థియేటర్లవైపు రప్పించడమే.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నుంచి ఓ సరికొత్త ఐడియా వచ్చింది. అదేంటంటే.. థియేటర్లో ఆల్కహాల్ అమ్మకం. బీరు, బ్రీజర్, వైన్ లాంటివి థియేటర్లో ప్రేక్షకులకు అమ్మకానికి ఉంచితే.. తప్పకుండా ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుందని వాళ్ల ఉద్దేశం. అసలు సురేష్ బాబుకి ఇలాంటి ఆలోచన వచ్చిందని మనకెవరికీ తెలిసేది కాదు. ప్రముఖ దర్శకుడు నాగ అశ్విన్ బయటపెట్టకపోతే. ఈమధ్య సురేష్‌బాబు, రానాలని కలిసినప్పుడు ఓ ఆలోచన బయట పెట్టారు. థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటు పెంచడానికి మద్యం అమ్మకాలు ఓ మార్గం అన్నారు, ఇది సరైన ఆలోచనేనా? అంటూ నాగ అశ్విన్ ట్వీట్ చేశారు. నిజానికి విదేశాల్లో థియేటర్లలో లిక్కరు అమ్మడం సాధారణమైన విషయమే. మన దేశంలోనూ అలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందన్నది సురేష్ బాబు ఉద్దేశం.
నిజానికి ఇది చాలా దారుణమైన ఆలోచన. సినిమా అనేది వినోద సాధనం. ఇంటిల్లిపాదికీ చౌకగా వినోదం దొరికే మార్గం. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడానికి సినిమాకి మించిన సాధనం, దారి మరోటి లేదు. అక్కడ కూడా బీర్లూ, వైన్లూ అమ్మకానికి పెడితే ఎలా? కచ్చితంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాకి మరింత దూరమైపోతారు. చుక్క పడితే.. మందు బాబులు చేసే రగడ మామూలుగా ఉండదు. అది బీరు కావొచ్చు, వైన్ కావొచ్చు. ఆమత్తులో చేసే విధ్వంసాలు చెప్పాల్సిన పని లేదు. పైగా థియేటర్లలో మద్యం అనుమతులు ఇస్తే అక్కడ రేట్లు మరింత పెరుగుతాయి. బయట 5 రూపాయలకు దొరికే సమోసాని 20 నుంచి 25 రూపాయలకు అమ్మి వ్యాపారం చేస్తుంటారు. ఈ రేట్లు భరించలేకే మద్యతరగతి సినిమాలకు దూరం అవుతోంది. ఇక మద్యం పెడితే.. జేబులు గుల్ల చేయడం ఖాయం.
మరి ఈ ఆలోచన.. ఆలోచనగానే ఉండిపోతుందో, కార్యరూపం దాలుస్తుందో చూడాలి. పొరపాటున ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే.. థియేటర్లు బార్ల కంటే దారుణంగా తయారవుతాయి.