లాక్ డౌన్ వల్ల దేశం మొత్తం స్థంభించిపోయింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. సినిమాలు, షాపింగ్ మాళ్లూ బంద్ అయ్యాయి. నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయి గానీ, ఆల్కహాల్ మాత్రం దూరమైంది. దీంతో చుక్కలేనిదే పొద్దుపోని మందుబాబులు అష్టకష్టాలూ పడుతున్నారు. డ్రై డే రోజున కూడా బ్లాకులో మద్యం కొనుగోలు చేసి, దాహార్తిని తీర్చుకునే మందుబాబులు ఇప్పుడు చుక్క దొరక్క అల్లాడిపోతున్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా? మళ్లీ వైన్ షాపుల ముందు ఎప్పుడు క్యూ కడతామా? అంటూ రోజులు లెక్కబెడుతున్నారు. కొంతమంది పరిస్థితి అతి దారుణంగా ఉంది. నిత్యావసర వస్తువులులానే ఇక నుంచి మద్యం కూడా సరఫరా చేస్తారని, రోజుకి రెండు గంటలు పాటు వైన్ షాపులు తెరచి ఉంచుతారని ఓ పుకారు వ్యాపించడంతో, అది నిజమే అనుకుని వైన్ షాపులు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఓ ప్రబుద్ధుడు కాస్త ముందు అడుగేసి, మద్యం ఇంటికే సరఫరా చేసేలా ఓ చట్టం రూపొందించాలని కోర్టు కెక్కాడు. సదరు పిటీషను దారుడికి నాలుగు అక్షింతలు వేసిన కోర్టు, ఇలాంటి చెత్త పిటీషన్ దాఖలు చేసినందుకు గానూ 50 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.
ఇప్పుడు మందు దొరక్క, నాలుక పీక్కుపోయి, మతిస్థిమితం చెడిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ కారణంతోనే ఆదివారం ఎర్రగడ్డ ఆసుపత్రిలో 50 కేసులు నమోదయ్యాయి. సోమవారం మరో వంద మంది పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం వైద్యుల్ని సంప్రదించారు. మద్యం వ్యసరమైపోవడం వల్ల, సకాలంలో మద్యం దొరక్కపోవడంతో మతిస్థిమితం తప్పుతుందని, పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తారని, ఈ తరహా కేసులు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లో ఒక్క హైదరాబాద్లోనే ఇలాంటి కేసులు 200 వరకూ వెలుగు చూశాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. శానిటైజర్లలో ఆల్కహాల్ ఉందన్న ప్రచారం మొదలవ్వడంతో కొంతమంది ప్రత్యామ్నాయంగా శానిటైజర్లు సేవిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఊర్లలో పరిస్థితి వేరు. అక్కడ మద్యం దొరక్కపోయినా కళ్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వాటి ధరలకు రెక్కలొచ్చాయి. ఇది వరకు రెండు లీటర్ల బాటిల్ రూ.100కి అమ్మేవారు. ఇప్పుడు 500 ఇచ్చి కళ్లు కొనడానికి సైతం జనాలు ఎగబడుతున్నారు.