ప్రముఖ హాస్యనటుడు అలీ వైకాపాలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన కండువా కప్పుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయిన మర్నాడే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ వస్తేనే అభివృద్ధి అని ప్రజలు నమ్ముతున్నారనీ, పార్టీలోకి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారని అలీ చెప్పారు. టిక్కెట్ల విషయమై ఇప్పటికే జగన్ చాలామందికి హామీలు ఇచ్చేయడంతో తనకు టిక్కెట్ దక్కే అవకాశాలు తక్కువ ఉన్నాయనీ, ఎన్నికల్లో పోటీతో సంబంధం లేకుండా పార్టీ తరఫున ప్రచారం చేస్తానని అలీ చెప్పారు. ఒకవేళ జగన్ తనకు రాజమండ్రి లేదా విజయవాడ నుంచి అవకాశం ఇస్తే పోటీ చేస్తానంటూ తన మనసులో మాట చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, పవన్ కల్యాణ్ ని గతంలో మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుకున్నానని స్పష్టం చేశారు.
అలీకి వైకాపాలో టిక్కెట్ దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. అయితే, గతంలో అలీ చేసిన కొన్ని ప్రకటనలు ఇప్పుడు చాలామందికి గుర్తొస్తున్నాయి. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే పార్టీలో మాత్రమే చేరతానని ఆయన అన్నారు. అంతేకాదు, ఎన్నికల తరువాత అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి కూడా కచ్చితంగా కావాలని, ఇలా పక్కాగా హామీ ఇచ్చే పార్టీలోనే తాను చేరతా అంటూ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు, పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. టీడీపీలో చేరడం దాదాపు ఖరారైపోయిందన్నారు. చివరి నిమిషంలో వైకాపా కండువా కప్పుకున్నారు. టీడీపీలో చేరతారనే కథనాలు వచ్చిన సందర్భంలో రాజమండ్రి, లేదా గుంటూరు నుంచి అలీ టిక్కెట్ ఆశిస్తున్నారని వినిపించింది.
వైకాపాలో టిక్కెట్ దక్కే పరిస్థితే కనిపించడం లేదు. తనకు టిక్కెట్ తోపాటు మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఇస్తే తప్ప ఏ పార్టీలోనూ చేరనన్నారు. మరి, ఆ మేరకు జగన్ నుంచి అలీకి హామీ లభించిందా..? లేదంటే, షరతులు పెట్టుకుంటూ తిరిగే ఏ పార్టీలోనూ చేరే అవకాశం ఉండదనే వాస్తవం అలీకి అర్థమైందా..? ఈ షరతుల వల్లనే టీడీపీ, జనసేనలో చేరే అవకాశం అలీకి లేకుండా పోయిందా..? ఇంకా ఆలోచిస్తూ పోతే పొలిటికల్ కెరీర్ ప్రారంభం కాదన్న ఆలోచనతోనే వైకాపాలో చేరారా..? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలన్నీ చాలామందికి కలుగుతున్నాయి. వాస్తవానికి, అలీ చేరికతో ఎన్నికల ప్రచారంలో కొంత సినీ గ్లామర్ ఉపయోగపడే అవకాశం ఉంది.