పవన్ కల్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అలీ అనేది చరిత్రే. రాజకీయాల్లో .. వైసీపీ రాజకీయాల్లో చేరి.. ఆత్మీయుల్ని దూరం చూసుకున్న వారిలో అలీ చేరిపోయారు. వైసీపీ హైకమాండ్ ను మెప్పించడానికి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. అటూ ఇటూ కాకుండా అయిపోయారు. అలీతో ఎలాంటి పరిచయాల్ని కొనసాగించడానికి పవన్ సిద్ధంగా లేరని.. గత పరిచయాలు..స్నేహాలు ఏమైనా ఉంటే మార్చిపోవాలని డిసైడయ్యారని.. తాజాగా ఇన్ స్టా లో ఫస్ట్ పోస్టు ద్వారా పవన్ తేల్చేసినట్లయిది.
ఇటీవల ఇన్స్టాగ్రామ్లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్… తన మొదటి పోస్టులో సినిమా ఇండస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ”ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి” అని ఆయన పేర్కొన్నారు. చివర్లో ”మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ…” అంటూ ముగించారు. తన పోస్టులో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణులతో దిగిన ఫోటోలను పవన్ కళ్యాణ్ షేర్ చేశారు.
ఎక్కడా కూడా అలీ ఫోటో లేదు. ‘హైపర్’ ఆది ఉన్నారు. హాస్య నటుడు శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. కానీ అలీని మాత్రం దూరం పెట్టారు. ఇంకా విశేషం ఏమిటంటే.. పేటీఎం ఆర్టిస్టు మౌనికా రెడ్డిగా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుని సినిమాల్లోకి వచ్చిన యువతి కూడా పవన్ పోస్టుల్లో ఉన్నారు. ఆమె గతంలో పవన్ ను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలీకి చోటు లేదు. గత ఎన్నికల సందర్భంగా అలీ.. వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలో చేరినా పవన్ పట్టించుకోలేదు కానీ.. నేరుగా పవన్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి శృతి మించిపోయాయి. అందుకే పవన్ రిలేషన్ కట్ చేసుకున్నారని.. మరో సారి గుర్తు చేసుకోవడానికి కూడా రెడీగా లేరంటున్నారు. ఇటీవల అలీ ఇంట్లో శుభకార్యానికి కూడా వెళ్లలేదు.