ఒకప్పుడు పవన్ – అలీ గొప్ప మిత్రులు. వాళ్ల బంధం ఎంత బలమైనదంటే.. అలీ లేకుండా నేను సినిమాలు చేయలేనేమో అని స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పేంత గట్టిది. కాలక్రమేణా ఈ బంధానికి బీటలు వారాయి. దానికి నూటికి నూరు శాతం అలీనే కారణం. పవన్ పార్టీలో సీటు దొరక్కపోవడడంతో వైకాపా లో దూకేశాడు. అయితే.. అక్కడ కాస్త స్థిమితంగా ఉంటే బాగుణ్ణు. పార్టీ వేరైనా, పవన్ ని మిత్రుడిగా చూసుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేకపోయేవి. కానీ.. పవన్ ని ప్రత్యర్థిగానే చూశాడు. కొన్ని మాటలు తూలాడు. కట్ చేస్తే… ఐదేళ్లు గడిచాయి. అధికారం మారింది. పవన్ ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్రధారి. అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే రాజకీయాలు మారాయో, అధికారం మారిందో అప్పుడు అలీ వైఖరి కూడా మారింది. పవన్ కు ఏదోలా దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు ఓ సినిమా వేడుకలో పవన్ తో మీ అనుబంధం ఎలా ఉంది? అని అడిగితే ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అంటూ నవ్వేశాడు. పవన్‌తో నటించడానికి తనకెలాంటి ఇబ్బంది లేదని, తాను నటించడానికే ఉన్నానని చెప్పుకొచ్చాడు.
అలీ ఎప్పుడైతే ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడో, పవన్ ఫ్యాన్స్ అలర్ట్ అయిపోయారు. అలీని నమ్మకు.. దగ్గరకు రానివ్వకు అంటూ పవన్ కు సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇవ్వడం మొదలెట్టారు. నిజానికి అలీ చెప్పినంత సీన్ అయితే.. పవన్ దగ్గర లేదనే చెప్పాలి. పవన్ ది చిరులా మెతక వైఖరి కాదు. ఓసారి తిట్టి, ఇంకోసారి క్షమించమంటే అక్కున చేర్చుకోవడానికి. ఇన్నేళ్ల ప్రయాణంలో పవన్ బాగా రాటు దేలాడు. ఎవర్ని ఎక్కడ ఉంచాలా అక్కడ ఉంచుతున్నాడు. పవన్ కు అలీ ఇప్పుడు దగ్గర కాకపోవడానికి కారణం కూడా అదే. పాత స్నేహాలు గుర్తు చేస్తూ దగ్గరవ్వాలని చూసే ప్రయత్నాలకు పవన్ ఏనాడో చెక్ పెట్టేశాడని తెలుస్తోంది. కాకపోతే అలీ తన ప్రయత్నాలు మానడం లేదు. వీలైనప్పుడల్లా పవన్ ని గుర్తు చేసుకోవడం, పవన్ తో కలిసి నటిస్తా అని మీడియాకు చెప్పడం పరిపాటిగా మారిపోయాయి. కాకపోతే పవన్ గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం భవిషత్తులో పవన్ – అలీ కాంబో చూడడం దాదాపు అసాధ్యమనే అంటున్నారు.