సీఎం జగన్ రెండు వారాల్లో గుడ్ న్యూస్ చెబుతారని ఎదురుచూస్తూ … ఆరేడువారాలు గడపేసిన అలీకి చివరికిఅది రాదని తేలిపోయింది. అనవసరంగా పిలిచారు కదా అని డిజైనర్ దుస్తుల్లో సతీ సమేతంగా సీఎంను కలిశానే ఆని ఆయన లోలోపల బాధపడుతున్నారేమో కానీ బయట మాత్రం తనను సీఎం జగన్ లీడర్‌ను చేస్తారని చెబుతున్నారు. ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లలో మీడియా రాజకీయాలపై మాట్లాడితే జగన్ దృష్టిలో తాను ఉన్నానని.. ఆయనే తనను లీడర్‌ను చేస్తారని చెబుతున్నారు.
రాజ్యసభ సీటును జగన్ హామీ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే ఇంత ప్రచారం జరిగిన తరవాత అలీకి చాన్స్ లేకపోవడంతో ఆయన ఫీలై ఉంటారు. కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తే మొదటికే మోసం వస్తుందని ఫీలవుతున్నారేమో కానీ ఇప్పటికైతే నోరు తెరవడం లేదు. బాగా ప్రచారం జరిగింది కాబట్టి ఏదో ఓ అవకాశం ఇస్తారని నమ్ముతున్నారు. బహుశా.. వచ్చే ఎన్నికల్లో ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇస్తారని అలీ నమ్ముతున్నట్లుగా ఉంది. గుంటూరు లేదా రాజమండ్రి టిక్కెట్లను ఆయన ఆశిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకూ ఆయనకుఎలాంటి సంకేతాలు రాలేదు. వచ్చి ఉంటే ఆయా నియోజకవర్గాల్లో పని చేసుకునేవారే. ఇప్పటికే వైసీపీ నేతలు.. క్యాడర్ మొత్తం కార్యాచరణలోకి దిగేశారు. అలీకి మాత్రం ఫలానా చోట పని చేసుకోవాలని చెప్పలేదు. అయితే అలీ లా అవకాశం ఇస్తామని హామీ పొందిన వాళ్లు చాలా మంది ఉన్నారని.. వారంతా నిజంగా పార్టీ కోసం పని చేసిన వాళ్లని వాళ్లకు అవకాశం ఇచ్చిన తర్వాతనే జగన్ అలీ గురించి ఆలోచిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.