సినీ నటుడు అలీ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీలో చేరబోతున్నారని విస్త్రతంగా ప్రచారం జరిగినా.. చివరి క్షణంలో ఆయన వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ భరోసా రాలేదని… అలీ.. పార్టీలో చేరిన తర్వాత మీడియాకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ గా మాట ఇస్తే కట్టుబడి ఉంటారని.. విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ తరపున ప్రచారం చేయమని జగన్ చెప్పారని.. అలీ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీకి సిద్దమేనని చెప్పారు కానీ.. టిక్కెట్ విషయంలో మాత్రం జగన్ క్లారిటీ ఇచ్చినట్లుగా ఆయన చెప్పలేదు. రాజమండ్రి, విజయవాడల్లో అవకాశమిస్తే పోటీ చేస్తానని అలీ చెప్పారు. ప్రచారం చేసి మేజార్టీతో గెలిపించు. తర్వాత నేను చూసుకుంటానని జగన్ భరోసా ఇచ్చారని చెప్పుకొచ్చారు.
నిజానికి అలీ.. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడికి తన ఓటును కూడా మార్పించుకున్నారు. టీడీపీలో గుంటూరు టిక్కెట్ వస్తుందని ఆశ పడ్డారు. కానీ.. చంద్రబాబు… పార్టీ కోసం కష్టపడిన నేతలు చాలా మంది ఉన్నారు కాబట్టి.. సాధ్యం కాదని తేల్చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన వైసీపీ వైపు చూశారు. అక్కడ ఆయన అడిగినట్లుగా… టిక్కెట్ ఖరారు చేయలేదు. అయితే..ఓ ఆశ మాత్రం కల్పించారు. విజయవాడ లేదా.. రాజమండ్రి విషయంలో పరిశీలిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ గత ఎన్నికల్లో వైసీపీ తరపున జలీల్ ఖాన్ గెలిచారు. కానీ ఇప్పుడు ఆయన కుమార్తె టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. అక్కడ అలీని నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
అదే సమయంలో… రాజమండ్రి.. అలీ సొంత ఊరు. అక్కడ ఆయన కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ కూడా అలీ పేరును పరిశీలించే అవకాశం ఉంది. అలీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఆయన ఈ విషయాన్ని దాచుకోకుడా చెబుతున్నారు. వైసీపీలో చేరిన తర్వాత ప్రచారం మాత్రమే చేస్తానని బయటకు చెబుతున్నారు కానీ.. టిక్కెట్ ఇవ్వకపోతే మాత్రం.. ఆయన అసంతృప్తికి గురవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సీటు మాత్రమే కాదు.. మంత్రి పదవి కూడా.. ఆయన హిట్‌లిస్ట్‌లో ఉంది. తర్వాతైనా సమస్య అవుతాడన్న ఉద్దేశంతో… టీడీపీ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.