హైదరాబాద్: ఆడియో ఫంక్షన్లలో ఆలీ చేసే కామెంట్స్ అప్పుడప్పుడూ శృతి మించుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆమధ్య సమంత నడుము విజయవాడ బెంజి సర్కిల్లా ఉంటుందని కామెంట్ చేయటం, దానిపై ఎన్ఆర్ఐ యువతి అన్నపూర్ణ తీవ్రంగా మండిపడుతూ, ‘వాడు మనిషా, దున్నపోతా’ అని వ్యాఖ్యానించటంకూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆలీ మాత్రం ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోకుండా తన స్టైల్లో తాను వెళ్ళిపోతూనే ఉన్నాడు.
సైజ్ జీరో ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిగింది. రాజమౌళి, కీరవాణి, రాఘవేంద్రరావు, అనుష్క, రానా, ఆర్య, నిర్మాత పొట్లూరి ప్రసాద్, దర్శకుడు ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ, సుమ ఇంతకుముందు మాట్లాడిన సోనాల్ చౌహాన్‌ను తొడకొట్టమని అడిగిందని, అయితే తొడకొట్టమని అడగాల్సిన హీరోయిన్ అనుష్క అని చెప్పారు. అనుష్కకు అద్భుతమైన తొడలు ఉన్నాయని అన్నారు. బిల్లా సినిమాలో ఆమె తొడలు మామూలుగా ఉండవని చెప్పారు. అప్పటినుంచి తాను అభిమానినయ్యానని అంటూ అనుష్కవైపు తిరిగి, “నీకోసం నేను సైకిల్ తొక్కుతాను” అన్నారు. అనుష్క ఆలీ మాటలకు ముసిముసిగా నవ్వుకుంటూ కనిపించింది. అక్కడితో ఆగకుండా, తొడల సృష్టికర్త రాఘవేంద్రరావు అని, తన సినిమాలలో ఎన్నోతొడలు చూపించాడని ఆలీ చెప్పారు. ఏ తొడా వదలలేదని అన్నారు. ఈ మాటలు చెబుతుంటే రాఘవేంద్రరావు సిగ్గుతో తల దించుకున్నారు. ఆలీ ఈటీవీలో నిర్వహించే వివిధ షోలలోకూడా అతిథులతో ఇలాంటి కామెంట్స్ చేస్తూఉండటం పరిపాటే.