అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతున్న అలీ.. పవన్ పై అయినా పర్వాలేదని పార్టీ హైకమాండ్‌కు సంకేతాలు పంపుతున్నారు. నగరిలో రోజా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన .. ప్రభుత్వ సలహాదారు అలీ.. అందరిలాగే పవన్ పై మాట్లాడకపోతే విలువ ఉండదని అనుకున్నారేమో కానీ.. పార్టీ ఆదేశిస్తే పవన్ పై పోటీకి సిద్ధమని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ తనకు మిత్రుడే అయినా.. రాజకీయం వేరు.. ఫ్రెండ్ షిప్ వేరని అలీ చెప్పుకొచ్చారు.
అయితే అసలు అలీకి ఈ సారి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించే అవకాశాలు లేవని వై సీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం టిక్కెట్ల కసరత్తు ఎప్పుడో ప్రారంభించారని… అలీకి ఎక్కడైనా టిక్కెట్ ఇచ్చే పరిస్థితి ఉంటే.. ఆయనను నియోజకవర్గంలో పని చేసుకోమని సూచించేవారంటున్నారు. అలా టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి.. ఆయనకు ఇటీవల సలహాదారు పదవి ఇచ్చారంటున్నారు. ఇప్పుడు అలీ ప్రకటనతో .. పవన్ కల్యాణ్ పై పోటీకి అలీని పరిశీలిస్తారని ఆయన ఆశ కావొచ్చని అంటున్నారు.
వైసీపీలో చేరిన వారు ఎవరైనా వ్యక్తిగత మిత్రుల్ని.. కూడా శత్రువుల్ని చేసుకోవాల్సిందే. అలీ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. గత ఎన్నికలకు ముందు స్నేహంగా ఉండే వీరిద్దరూ ఎన్నికల సమయంలో పవన్ పై అలీ మితిమీరి విమర్శలు చేయడంతో ఫ్రెండ్ షిప్ కట్ అయిపోయింది. ఇటీవల అలీ తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఆ వేడుకకు కూడ పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. కానీ అలీ మాత్రం పవన్ తనకు ఫ్రెండేనని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పోటీకి కూడా రెడీ అంటున్నారు.