తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో హీరోలకంటే హీరోయిన్లే కాస్త ముందుంటారేమో..? తెలుగు హీరోయిన్ల సంగతేమో కానీ, బాలీవుడ్ వెళ్తే అలియాభట్ ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటుంది. అలియా ఏ సినిమా చేసినా ఆ సినిమా ప్రమోషన్ల కోసం విపరీతంగా కష్టపడుతుంది. మొన్నటికి మొన్న గంగూభాయ్. ఆ తరవాత… బ్రహ్మాస్త్ర ఇందుకు పెద్ద ఉదాహరణలు. లేటెస్టుగా చెప్పాలంటే.. ‘జిగ్రా’. ఈనెల 11న ‘జిగ్రా’ వస్తోంది. అందుకే ప్రమోషన్ల జోరు పెంచింది. దేశమంతా.. తన టీమ్ తో తిరుగుతోంది అలియా.
అందులో భాగంగా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చింది అలియా. ఈవెంట్ మొత్తం ఎనర్జిటిక్‌గా కనిపించింది. సిసలైన లేడీ సూపర్ స్టార్ అనిపించింది. యాంకర్ సుమ సరదాగా వచ్చి ఊ.. అంటావా పాట పాడమంటే, ఏమాత్రం ఆలోచించలేదు. రాగయుక్తంగా పాడింది. తెలుగు అర్థమవ్వడమే కష్టం. పైగా ఐటెమ్ గీతం. అయినా సరే, ఎక్కడా తడబడకుండా, రిథమ్ మర్చిపోకుండా పాటని పాడిన విధానం ఆకట్టుకొంది. ‘మగధీర’లోని ‘ఒకొక్కడ్ని కాదు షేర్ ఖాన్’ డైలాగ్ చెప్పమంటే బెదిరిపోలేదు. ఒకటికి రెండు సార్లు ఆ వీడియో ప్లే చేయమని చెప్పి, ఆ డైలాగ్ బట్టీపట్టడానికి ట్రై చేసింది. ‘నాటు..నాటు’ పాటకు స్టెప్పులేసింది. స్టేజీ పై తనకు తెలిసిన తెలుగు మాట్లాడింది. ఇదంతా తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకొనే ప్రయత్నాల్లో భాగం కావొచ్చు. కాకపోతే.. ఈ ప్రయత్నంలో తన డెడికేషన్ ని ఏమాత్రం మర్చిపోకూడదు. స్టేజీపై త్రివిక్రమ్, రానాలు తెలుగులతో మాట్లాడుతుంటే, తనకు అర్థం కాని విషయాల్ని పక్కనే ఉన్న సమంతని అడిగి తెలుసుకొంది.
స్టేజీపై తన మాటలతో కూడా అలియా ఆకట్టుకొంది. సమంతకు పాన్ ఇండియన్ స్టార్ గా కితాబిచ్చింది. నిజానికి అసలైన పాన్ ఇండియా స్టార్ అలియానే. అలియాతో స్టార్ డమ్ సమంత కంటే ఎక్కువ. అయినా సరే, సాటి హీరోయిన్ని, తన వేడుకకు అతిథిగా వచ్చిన తన స్నేహితురాల్ని గౌరవించుకొంది. `ఆర్.ఆర్.ఆర్`తో అలియా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తనతో సినిమా చేయాలని వుందంటూ త్రివిక్రమ్ స్వయంగా చెప్పారు. చూద్దాం.. అలాంటి అవకాశం వస్తుందేమో..? తెలుగులో తీస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా అలియా ఓ మంచి ఆప్షన్. కాకపోతే… తెలుగు ప్రేక్షకులకు అప్పుడప్పుడూ కాస్త టచ్ లో ఉండాలంతే. ప్రస్తుతం అలియా కూడా అదే చేస్తోందేమో.!