2019 అసెంబ్లీ ఎన్నికలముందు అలీ కాస్త హైడ్రామా నడిపిన సంగతి తెలిసిందే. టీడీపీ – జనసేన – వైకాపా అంటూ అటూ ఇటూ తిరిగి, చివరికి జగన్తో కండువా కప్పించుకున్నారు. అయితే సీటు మాత్రం దక్కలేదు. జగన్ పార్టీ అధికారం చేపట్టాక అలీకి ఓ పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఎఫ్డీసీ ఛైర్మన్ పదవిపై ఆయనకు కన్నుందని బాగా ప్రచారం సాగింది. దానికి తగ్గట్టే అలీ ఎఫ్డీసీ ఛైర్మన్ అయిపోయాడని వార్తలూ బాగానే షికారు చేశాయి. రోజా, ఫృథ్వీలాంటి వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు అలీ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అలీ ఆశలు పెంచుకున్న ఎఫ్డీసీ ఛైర్మన్ పదవి మరో సీనియర్ నటుడు విజయ్ చందర్ పట్టుకెళ్లిపోయారు. విజయ్ చందర్ని ఎఫ్డీసీ ఛైర్మన్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు జీవోని జారీ చేసింది. దాంతో అలీ ఆశలు ఆవిరయ్యాయి. ఎఫ్డీసీ ఛైర్మన్ పదవి తనకే నని, అలీ చాలా సందర్భాల్లో సన్నిహితులతో చెప్పుకునేవారని తెలిసింది. జగన్ని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. చివరికి ఏమైందో, ఏమో.. ఆ అవకాశం విజయ్ చందర్ని వరించింది. జగన్ హయాంలో ఇప్పుడు పేరెన్నదగిన నామినేటెడ్ పదవులన్నీ అయిపోయినట్టే. కనీసం అలీని రాజ్యసభకైనా పంపుతారేమో చూడాలి.