మద్యాన్ని స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలెంజ్ చేశారు. కానీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉన్నా.. ఆయన దుకాణాలు..బార్ల సంఖ్యను పెంచడమే కాకుండా..మూడేళ్లకుపైగా లైసెన్సులు ఇచ్చి మాట తప్పానని రికార్డుల పరంగా రాసిచ్చేశారు. అయితే ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం.. ప్రజలకు భయపడి..హామీ ఇవ్వకపోయినా మద్య నియంత్రణ చేస్తున్నాయి.
మధ్యప్రదేశ్లో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ సీఎం చౌహాన్.. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఊహించి.. కొత్త ప్లాన్ బయటకు తీశారు. అదే మద్య నియంత్రణ. మధ్యప్రదేశ్ లో అన్ని బార్లను మూసివేస్తూ కొత్త ఎక్సైజ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. షాపుల్లో పర్మిట్ రూములను కూడా అనుమతిచరు. విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్లు, మత స్థలాల నుంచి మద్యం షాపుల దూరాన్ని 50 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచుతారు.
ఇలా ఊరికే మద్య నియంత్రణ చేస్తే ఓట్లు వేయరు కాబట్టి బీజేపీ కొంత ప్లాన్ ప్రకారం వెళ్తోంది. బీజేపీ ఎంపీ ఉమా భారతి కొద్ది రోజులుగా మద్య నియంత్రణ చేపట్టాలని ఉద్యమం చేస్తున్నారు. షాపుల మీద దాడి చేయడం వంటివి చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బార్లు బంద్ చేస్తూ ఉత్తర్వులిచ్చినట్లుగా భావిస్తున్నారు.
2018లో జరిగిన ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే స్వల్ప మెజార్టీ వచ్చింది. చివరికి జ్యోతిరాదిత్య సింధియా పార్టీని ధిక్కరించి బీజేపీలో చేరిపోయారు. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు సహా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు. చౌహాన్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు ప్రజా వ్యతిరేకత మొత్తం బీజేపీని భయపెడుతోంది.