ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బైజూస్ కంటెంట్ తో .. తెలుగు విద్యార్థుల రాత మార్చేద్దామనుకున్నారు కానీ.. ఆ కంపెనీ మాత్రం నిలబడేలా కనిపించడం లేదు. ఇప్పటికే రకరకాల సమస్యలతో ఉన్న ఆ కంపెనీ ఇప్పుడు ఆఫీసులన్నింటినీ మూసేసింది. అద్దెలు తగ్గించుకోవడానికి.. ఖర్చులు మిగిల్చుకోవడానికి మూసేస్తున్నట్లుగా కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. చాలా మంది ఉద్యోగులని తీసేయడం లేదా మానేయడం చేశారు. ఉన్న అరకొర ఉద్యోగులని వర్క్ ఫ్రం హోం చేయమని సూచించారు.
బైజూస్ తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో ఉంది. జీతాలివ్వడానికి కూడా కనీస నగదు చేతిలో లేకుండా పోయింది. మరో వైపు వేల కోట్ల అప్పులకు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంది. వాటికి సంబంధించిన కేసులు అమెరికా కోర్టుల్లో ఉన్నాయి. మరో వైపు ఆదాయానికి.. ఖర్చులకు పొంతన ఉండటం లేదు. అసలు నిజమైన లెక్కలు చెప్పడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో ఒక్క సారిగా ఎదిగిపోయి.. లక్షల కోట్ల విలువైన కంపెనీగా పేరు తెచ్చుకున్న సంస్థ వాల్యూని ఇటీవల ఏకంగా 99 శాతం తగ్గించారు. అయినా కష్టాల్లో మార్పు రావడం లేదు.
గత నెల జీతాలు కూడా అందరికీ ఇవ్వలేదని ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ వైపు బైజూస్ కంటెంట్ పై కస్టమర్లు విశ్వాసం కోల్పోయారు. కంటెంట్ ఏ మాత్రం ప్రయోజనకరంగా లేదని తేలడంతో ఎవరూ కొత్తగా సబ్ స్క్రయిబ్ చేసుకోవడం లేదు.. కంటిన్యూ చేసుకోవడం లేదు. ఫలితం ఆదాయం పడిపోయింది. ఈ సంక్షోభం నుంచి బైజూస్ గట్టెక్కడం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది.