కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలపై సందేహం ఏర్పడింది. నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి రూ. వెయ్యి కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది.అయితే ప్రభుత్వం నేరుగా ఆ నిధులను వాడుకోవడానికి లేదు. గతంలో దారి మళ్లించి సంక్షేమ పథకాలకు ఇతర వాటికి వాడుకుంది. బిల్లులు చెల్లించలేదని కొన్ని వేల మంది హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ రాకుండా ఏపథకం నిధులు ఆ పథకానికే ఖర్చు చేసేలా కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏ పథకం అయినా వంద శాతం నిధులు కేంద్రం ఇవ్వదు. పథకాన్ని బట్టి రాష్ట్రం కూడా కొంత మొత్తం వెచ్చించాలి.
ఇలా వెచ్చించాల్సిన మొత్తాన్ని రాష్ట్రం కూడా జమ చేయాల్సి ఉంది. జమ చేయకపోతే ఆ నిధుల విడుదల సాధ్యం కాదు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వానికి ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. అందుకే వినూత్నంగా ఆలోచించి కేంద్ర పథకాలకు వచ్చే నిధులను ష్యూరిటీగా పెట్టుకుని రూ. ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు ఇవ్వాలని ఎస్బీఐని కోరింది. ఈ ప్రతిపాదనను చూసి ఎస్బీఐ కూడా షాక్కు గురయింది. ఉన్నతాధికారులకు ఒళ్లు జలదరించిందేమో కానీ అలాంటి చాన్స్ లేదని.. స్పష్టం చేశారు. ఓడీ షరతు లేకుండా ఆ నిధుల ఖాతాలను తెరుచుకోవచ్చని చెప్పింది.
ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఇప్పుడు కేంద్ర పథకాలకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే ఆ నిధులు కూడా … పథకాలు కూడా ఆగిపోతాయన్న ప్రచారం ఉంది. కొసమెరుపేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్వల్ప మొత్తం వెచ్చించాల్సిన రైల్వే ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వడం లేదు. ఆ పనులన్నీ ఆగిపోయాయి. ఎంపీలతో జరిగిన భేటీలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అదే చెప్పారు. కానీ నిధులు ఇప్పిస్తామని ఒక్క ఎంపీ కూడా చెప్పలేకపోయారు. అంటే రైల్వే పనులు ఇక జరగవన్నమాట.