పెద్ద సినిమా విడుదల అవుతోందంటే, అంతా టెన్షనే. ఫస్ట్ కాపీ రెడీ చేసి, అన్ని ఏరియాలకూ అవుట్ పుట్ పంపడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. గత మూడు రోజులుగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదే పనిలో తలమునకలై ఉన్నారు. ఈ పనుల్లో పడి ప్రమోషన్ ఈవెంట్లలోనూ పాల్గొనలేదు. ఎట్టకేలకు ‘కల్కి’కి సంబంధించి అన్ని పనులూ పూర్తయిపోయాయి. అన్ని ఏరియాలకూ, అన్ని భాషల వెర్షన్లూ పంపించేశారు. ఓవర్సీస్కూ ఫుటేజీ వెళ్లిపోయింది. దాంతో నాగ అశ్విన్ అండ్ టీమ్ రిలాక్స్ అయిపోయారు.
గురువారం కల్కి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 5గంటల 30 నిమిషాల ఆటతో.. ‘కల్కి’ హంగామా ప్రారంభం కాబోతోంది. అర్థరాత్రి షోలకు అనుమతి ఇచ్చినా, ‘కల్కి’ టీమ్ ఆ అడ్వాంటేజ్ తీసుకోలేదు. దేశ వ్యాప్తంగా కల్కి అడ్వాన్స్ బుకింగ్స్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. ఎన్ని షోలు పెంచుకొంటూ పోయినా, అన్ని హోస్ ఫుల్స్ అవుతున్నాయి. పెరిగిన టికెట్ రేట్ల నేపథ్యంలో తొలి రోజు కనీసం రూ.200 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ వీకెండ్ ‘కల్కి’కు కలిసొచ్చే అదనపు అంశం. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా తొలి నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేయడం ఖాయం.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించడం ఈ సినిమా మైలేజీ మరింత పెంచింది. కొన్ని సర్ప్రైజ్ పాత్రలూ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. వాళ్లెవరన్న విషయాన్ని ఇప్పటి వరకూ చిత్రబృందం గోప్యంగా ఉంచింది. టీజర్, ట్రైలర్లోనూ వాళ్లని చూపించలేదు. ఇవన్నీ ‘కల్కి’కి స్పెషల్ ఎట్రాక్షన్లే.