తెలంగాణలో హుజూరాబాద్ ప్రజలకు కురుస్తున్న వరాలు చూసి.. ఇతర నియోజకవర్గాల ప్రజల్లో ఆశలు ప్రారంభమయ్యాయి. తమ నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక వస్తే బాగుండు అని అనుకుంటున్నారని అన్ని రాజకీయ పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ అదే చర్చ జరుగుతోంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసి చాలా కాలం అయింది. అలాగే కొత్త సామాజిక పెన్షన్లు కూడా అంతే. ఈ రెండింటి కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే మళ్లీ పంపిణీ చేస్తామని నిర్ణయం ప్రకటించిన తెలంగాణ సర్కార్ వాటిని హుజూరాబాద్‌కే పరిమితం చేస్తోంది. అక్కడ అడిగిన వారికి రేషన్ కార్డులు.. పెన్షన్లు ఇస్తోంది. ఇతర చోట్ల మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
అదే సమయంలో హుజూరాబాద్‌లో అభివృద్ధి పనులను చురుకుగా కొనసాగిస్తున్నారు. ముఖ్యమమైన సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్లు తమ పనులు తాము ప్రారంభించారు. ఇక దళిత బంధు పథకం గురించి.. ఎంత చర్చ జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. అది కూడా ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం కావడం.. ఇతర నియోజకవర్గాల వారిని నిరాశపరుస్తోంది. తమకు ఒక్కటీ అదనంగా అందడం లేదని.. అన్నీ హుజూరాబాద్ నియోజకవర్గానికే వెళ్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారికి తమకీ ఉపఎన్నిక వస్తే బాగుండు అన్న ఆలోచన చేస్తున్నారు.
నిజంగానే ప్రజలు అలా అనుకుంటే అది వారి తప్పు కాదు. రాజకీయ లబ్ది కోసం మాత్రమే ప్రజాధనాన్ని వాడుకుని.. ఓట్లు వేసే ప్రజలకు మాత్రమే పంచేలా విధానాలు రూపొందించుకున్న ప్రభుత్వాలదే తప్పు. ప్రజాధనంతో.. ప్రజల్ని రాజకీయ వస్తువులుగా మార్చేసి.. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడటంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఉపఎన్నిక కోసం.. తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని.. ఇక నుండి ఉద్యమాలు ప్రారంభమైనా ఆశ్చర్యం ఉండదు.