ఏమాటకామాట చెప్పుకొంటే ఈ సంక్రాంతి సినిమాల్లో హైప్ సరిపోనిది గేమ్ ఛేంజర్‌కి మాత్రమే. తమన్ అందించిన పాటల్లో ఇన్స్టెంట్ గా ఎక్కేసిందేం లేదు. చరణ్ – శంకర్ కాంబో నుంచి రావాల్సిన ఆల్బమ్ మాత్రం రాలేదు. మరో పాట బాలెన్స్ వుంది. అది కాస్త విషాద గీతం. కాబట్టి.. పెద్దగా అంచనాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీజర్ వచ్చింది కానీ, అందులో శంకర్ బ్రాండ్ పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఇప్పుడు ట్రైలర్ రాబోతోంది. జనవరి 1న ట్రైలర్ ని వదులుతారని అనుకొన్నారు. కానీ.. 2కి వాయిదా పడింది. ఈ ట్రైలర్ పైనే మెగా ఫ్యాన్స్ ఆశలు. ఇప్పటి వరకూ ‘గేమ్ ఛేంజర్’ కాన్ఫ్లిక్ట్ ఏమిటన్నది చిత్రబృందం చెప్పనే లేదు. బయట రకరకాల కథనాలు ఉన్నాయే కానీ, టీజర్లో చూపించిందేం లేదు. కనీసం ట్రైలర్ తో అయినా ఈ చిక్కుముడి విప్పాలి.
శంకర్ సినిమా అంటే భారీదనం. యాక్షన్ బొనాంజా. ఇవి రెండూ కనిపించేలా ట్రైలర్ కట్ చేశారని తెలుస్తోంది. కొన్ని పొలిటికల్ పంచ్ లు కూడా పేలబోతున్నాయట. పాటలతో రాని హైప్.. ఈ ట్రైలర్ తీసుకొస్తుందని చిత్రబృందం నమ్ముతోంది. కథలో కీలకమైన సూర్య, శ్రీకాంత్, అంజలి క్యారెక్టరైజేషన్లు ఈ ట్రైలర్లో రివీల్ చేసే అవకాశం ఉంది. ట్రైలర్ లాంచ్ ఓ పబ్లిక్ ఈవెంట్ లా చేద్దామనుకొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానిద్దాం అనుకొన్నారు. కానీ ఇప్పుడు ఆ హంగామా లేకుండానే ట్రైలర్ వచ్చేస్తోంది. జనవరి 4న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అన్నారు. అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. అయితే ఈవారంలోనే ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఖాయం. వేమగిరి దగ్గర అందుకు వేదిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.