తెలుగులో ఈమధ్య సీక్వెల్స్ బాగానే ఆడుతున్నాయి. ‘డీజే టిల్లు’, ‘హిట్’ సీక్వెల్స్ మంచి విజయాల్ని అందుకొన్నాయి. ఇప్పుడు రాబోతున్న ‘మ్యాడ్ 2’పైనా అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగులో సీక్వెల్స్ ఓకే కానీ, తమిళనాడులో మాత్రం సీక్వెల్ వస్తోందంటే హడలిపోతున్నారు. అక్కడ వాళ్లకు తగిలిన ఎదురు దెబ్బలు అలాంటివి.
రజనీకాంత్ – శంకర్ల కాంబోలో రూపొందిన `రోబో` మంచి హిట్. కానీ.. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘2.ఓ’ నిరాశ పరిచింది. శంకర్ నుంచి వచ్చిన ‘భారతీయుడు 2’ మరో కళాఖండం. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వమ్’ తొలి భాగం బాగానే ఆడింది. కానీ పార్ట్ 2 మెప్పించలేకపోయింది. ఈ మూడు ఎదురు దెబ్బలు కోలీవుడ్ ని కోలుకోనివ్వకుండా చేశాయి. అక్కడ సీక్వెల్ అంటేనే భయపడిపోతున్నారు. అయితే.. రెండు సీక్వెల్స్ మాత్రం ఆశలు పెంచుతున్నాయి. ఒకటి… ‘జైలర్ 2’. మరోటి.. ‘ఖైదీ 2’.
రజనీకాంత్ – నెల్సన్ కాంబోలో వచ్చిన ‘జైలర్’ మంచి హిట్. రజనీకాంత్ కి చాలా కాలం తరవాత దొరికిన హిట్ అది. ‘జైలర్ 2’లో ఏం చెప్పబోతున్నాడన్న విషయంలో ‘జైలర్ 1’లోనే క్లారిటీ ఇచ్చేశాడు నెల్సన్. పార్ట్ 2 కథకు కావల్సినంత బిల్డప్ ముందే సెట్ అయిపోయింది. ‘జైలర్’లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఈసారి కూడా గెస్ట్ అప్పీరియన్స్లకు కొదవ లేదని తెలుస్తోంది. తెలుగు నుంచి ఓ స్టార్ హీరో ‘జైలర్ 2’లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే… ‘జైలర్ 1’ కంటే 2నే పెద్ద హిట్ కావొచ్చు.
లోకేష్ కనగరాజ్ పట్టిందల్లా బంగారమే. ‘ఖైదీ’తోనే తన స్టామినా మనకు అర్థమైంది. ‘ఖైదీ 2’ చేయాలని కార్తి కూడా ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కడానికి సిద్ధం అవుతోంది. ‘ఖైదీ 2’కి కావల్సిన సెటప్ పార్ట్ 1లోనే సెట్ చేసుకొన్నాడు లోకేష్. కాబట్టి.. ఈసారి ‘ఖైదీ’ మరింత రసవత్తరంగా తయారయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సీక్వెల్స్ కోలీవుడ్ ని మళ్లీ దారిలో పెడతాయని చెన్నై సినీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.