కల్కి భగవాన్ పేరుతో.. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుల్లో బాగా ప్రాచుర్యం పొందిన దంపతులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా వరదాయపాళ్యంలో ఉన్న ఆశ్రమంతో పాటు చెన్నై, సేలంలలో ఉన్న ఆశ్రమాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. కల్కిభగవన్కు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. అలాగే వివాదాలూ ఉన్నాయి. ఆశ్రమంలో భక్తులకు మత్తు పదార్థాలు ఇచ్చి.. లైంగిక వేధింపులకు పాల్పడేవారని గతంలో ఆరోపణలు వచ్చాయి. భక్తులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆశ్రమంలో ఉండి బయటకు వచ్చిన వారు ఆరోపణలు కూడా చేశారు.
కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి పొందిన స్వామి అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. ఎల్ఐసీలో క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఓ విద్యాసంస్థను నెలకొల్పారు. నష్టం రావడంతో.. ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయి… కల్కిభగవాన్గా తెరపైకి వచ్చారు. 1989లో చిత్తూరు జిల్లాలో భక్తి కార్యక్రమాలు ప్రారంభించారు. కాలంలోనే భక్తుల నమ్మకాన్ని పొందారు. తమిళనాడులోనూ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. తన భార్యను అమ్మ భగవాన్‌గా భక్తులకు పరిచయం చేశారు.
వీరు కాస్త పేరు పొందిన తర్వాత అత్యంత ఖరీదైన స్వాములుగా మారారు. వీరి ఆశ్రమానికి దేశంలోని ధనవంతులే కాకుండా విదేశీయులు, ఎన్నారైలు క్యూ కట్టేవారు. కల్కి భగవాన్ సాధారణ దర్శనానికి రూ.5వేలు, ప్రత్యేక దర్శనం కావాలంటే రూ.25 వేలు చెల్లించుకోవాల్సిందే. పాదపూజ చేయాలంటే..ఇంకా ఎక్కువ సమర్పించుకోవాలి. వీరిపై భూఆక్రమణ కేసులు కూడా ఉన్నాయి. 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు కూడా ఆదేశించింది. కల్కి భగవాన్ ఆశ్రమ వ్యవహారాలు మొత్తం గుట్టుగా ఉంటాయి. ఆ ఆశ్రమంపై దాడులు జరగడం ఇదే మొదటి సారి. అక్కడ ఎం బయట పడతాయోనని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.