ఈ దసరాకి పోటీ అంతా జై లవకుశ, స్పైడర్ల మధ్యే ఉంటుందనుకొన్నారు. వీటి మధ్యలో వచ్చిన మహానుభావుడు రిస్క్‌లో పడుతుందనుకొన్నారు. కానీ… సీన్ రివర్స్ అయ్యింది. జై లవకుశ బాగానే ఉన్నా.. ఎక్కడో ఏదో అసంతృప్తి. పైగా ఆ సినిమా వచ్చి వారం దాటేసింది. ఆ ప్రభావం.. మహానుభావుడుపై ఉండదు. స్పైడర్ చూస్తే.. భయంకరమైన డివైడ్ టాక్ నడుస్తోంది. మహేష్ చేయదగ్గ సినిమాకాదిది అని స్వయంగా ఆయన అభిమానులే చెబుతున్నారు. తొలి రోజు దుమ్ము దులిపేసిన స్పైడర్ వసూళ్లు.. రాబోయే రోజుల్లో ఆ స్థాయిలో ఉంటాయా అనేది అనుమానమే. సో.. మహానుభావుడుపై స్పైడర్ ఎఫెక్ట్ లేనట్టే.
ఇక అవకాశాలన్నీ శర్వా సినిమా – మహానుభావుడికే. ఏమాత్రం బాగున్నా.. జనంలోకి వెళ్లిపోతుంది. ఫ్యామిలీ అంతా కలసి చూసే లక్షణాలు ఎక్కువ ఉన్న సినిమా కూడా ఇది. జై లవకుశ, స్పైడర్లతో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా ఈ సినిమాలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. రెండు సినిమాలకూ డివైడ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలో – అందరికళ్లూ మహానుభావుడుపై పడడం ఖాయం. భలే భలే మగాడివోయ్ రేంజులో సగం ఉన్నా – శర్వా ఈ దసరా మొత్తం పండగ చేసుకొంటాడు. దానికి తగ్గట్టు ఈ సినిమాపై శర్వా, మారుతి ఇద్దరూ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. ఎంత ధైర్యం లేకపోతే ఎన్టీఆర్, మహేష్ సినిమాలతో పోటీ పడి ఈ సినిమాని విడుదల చేస్తారు చెప్పండి? ఆ ధైర్యమే నిజమైతే.. ఈ దసరాకి శర్వానందమే.