కాంగ్రెస్ అగ్రనేతల ఉత్కంఠ..! బీజేపీ నేతల ఉత్సుకత…! దేశ ప్రజల ఆసక్తి. ఇదీ ఇప్పుడు.. నాగపూర్ లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం ఎలా ఉంటుందన్న దానిపై నెలకొన్న పరిస్థితి. దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న భిన్నమైన అభిప్రాయాల మధ్య.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు ఆరెస్సెస్ ప్రచారక్ల శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహించే “సంఘ్ శిక్షా వర్గ్ “లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ప్రణబ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై కాంగ్రెస్ పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణబ్ నిర్ణయం దేశంలో అవాంఛనీయ విభేదాలకు దారితీస్తుందని వీరప్ప మొయలీ ఆందోళన వ్యక్తం చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాత్రం ప్రణబ్ అనుకున్నట్టుగానే ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొని…ఆ సంస్థ సిద్ధాంతంలోని తప్పిదాలను ప్రస్తావించాలని సూచించారు.
తన నిర్ణయాన్ని పునరాలోచించుకోమంటూ వందల సంఖ్యలో ఉత్తరాలు, వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పిన ప్రణబ్ ముఖర్జీ..తాను మాత్రం వెనక్కితగ్గేది లేదని గతంలోనే చెప్పారు. తాను చెప్పదలుచుకున్నది ఆర్ఎస్ఎస్ వేదికపైనే చెబుతానని స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు ప్రణబ్ ఏం చెబుతారన్నది హాట్ టాపిక్ అయింది. రాష్ట్రపతి పదవీ విరమణ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రణబ్ ముఖర్జీ.. భారతదేశం విభిన్న సంస్కృతులు, మతాలకు వేదికని చెప్పారు. వివిధ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు, వాదాలు ఉన్నా..పలు సందర్భాల్లో పరస్పరం కలహించుకున్నా ద్వేషం లేకుండా సాగడమే మన ప్రత్యేకత అని సందేశం ఇచ్చారు. సహనం,సోదరభావం ఈ దేశానికి మూలస్తంబాలని చెప్పిన ప్రణబ్..ఒకరి అభిప్రాయం మరొకరిపై రుద్దడానికి మన సంస్కృతి వ్యతిరేకమన్నారు. భారతీయతకు అసలు అర్ధం ఇదేనన్నారు.
ప్రణబ్ వెల్లడించిన ఈ అభిప్రాయానికి సైద్దాంతికంగా బద్దవ్యతిరేకి ఆర్ఎస్ఎస్.. భారతదేశాన్ని హిందూరాజ్యంగా మార్చడమే తమ ధ్యేయమంటూ అర్ఎస్ఎస్ నేతలు బహిరంగాగానే చెప్పుకుంటారు. ఆరెస్సెస్ ను ఇప్పటికి మూడుసార్లు నిషేధించారు. రాష్ట్రపతిగా తాను ఇచ్చిన సందేశాన్ని మళ్లీ ఆరెస్సెస్ వేదికగా నొక్కి చెబుతారా లేక.. కొత్త అంశాలతో కలకలం రేపుతారోనన్నది చాలా మందిలో ఉత్కంఠ కలిగిస్తోంది.
50 ఏళ్లుగా భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. విదేశీ, రక్షణ, ఆర్థిక వంటి కీలకమైన మంత్రిత్వశాఖలనన్నీటిని ఆయన నిర్వహించారు. మేన్ ఆఫ్ ఆల్ సీజన్స్’గా పేరుపొందిన ప్రణబ్ ను..కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా చెబుతారు. ముందు వెనుకలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకునేంత అపరిపక్వ రాజకీయవేత్త కాదు ప్రణబ్ ముఖర్జీ. అందుకే “ఆర్ఎస్ఎస్” ఆహ్వానాన్ని మన్నించడంలో ఆయన వ్యూహాలు రాజకీయ నైపుణ్యం ఆయనకున్నాయంటున్నారు రాజకీయ వేత్తలు. దీంతో ఆర్ఎస్ఎస్ వేదికపై ఈ కరుడుగట్టిన కాంగ్రెస్ వాది ఏం చెబుతారోనన్న ఆసక్తి నెలకొంది.