హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వేషధారణ చూస్తేనేమో పంచె, లాల్చీ, పైన కండువాతో సామాన్యమైన రైతులాగా కనిపిస్తారు. కానీ ఆయన ధరించే వాచ్, కళ్ళజోడు, షూస్ మాత్రం అంతర్జాతీయ స్థాయి అల్ట్రా లగ్జరీ బ్రాండ్లకు చెందినవి. ముఖ్యంగా ఆయన చేతికి పెట్టుకునే వాచ్ రు.70 లక్షలదని తేలటంతో కర్ణాటకలో ఇప్పుడు అందరి దృష్టీ దానిపైనే పడింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ఇటీవల ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సిద్దరామయ్య పెట్టుకునే వాచ్‌ల ఖరీదు బయటపెట్టటంతో ఈ వివాదం ప్రారంభమయింది. సిద్దరామయ్య తాను సోషలిస్టునని, తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని చెప్పుకుంటూ ఉంటారని, కానీ ఆయన ధరించేది రు.50 లక్షలపైన ఉండే వాచ్లనేనని కుమారస్వామి ఆరోపించారు. దీనిపై విలేకరులు సిద్దరామయ్యను ప్రశ్నించగా, ఆ వాదనలను కొట్టిపారేస్తూ, రు.10 లక్షలిస్తే కుమారస్వామికే ఈ వాచ్‌ను ఇచ్చేస్తానని అన్నారు. ఆయనలా తేలిగ్గా కొట్టిపారేసినప్పటికీ ఆయన వాచ్‌లపై చర్చ తగ్గకపోగా పెరిగిపోయింది. సిద్దరామయ్య ధరించే వాచ్‌లు, కళ్ళజోడు, షూస్పైన మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. సిద్దరామయ్య ధరించే ‘హ్యూబ్లో’ వాచ్‌లో వజ్రాలు పొదిగి ఉన్నాయని దాని ఖరీదు రు.70 లక్షలకు ఏమాత్రం తగ్గదని అని రాశాయి. ఆయనకు ‘హ్యూబ్లో’ కాకుండా ‘రోలెక్స్’, ‘ఆడిమార్ పీగే’ కంపెనీల వాచ్‌లు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. రు.1,50,000 ఖరీదు చేసే ‘మాంట్ బ్లాంక్’ కళ్ళజోడు, ‘హెర్మెస్’, ‘లూయీ విటాన్’ కంపెనీల షూస్ ధరిస్తారని కూడా రాశాయి.
హ్యూబ్లో వాచ్‌ను తనకు ఒక అభిమాన కానుకగా ఇచ్చాడని సిద్దరామయ్య చెప్పినప్పటికీ ఎవరూ నమ్మటంలేదు. సిద్దరామయ్య ఆస్తుల ప్రకటనలో పేర్కొన్నదాని ప్రకారం ఆయనకు రు.2 లక్షల నగదు, రు.42 లక్షల నగదు, కొంత పొలం, 350 గ్రాముల బంగారం, ఒక టయోటా ఇన్నోవా కారు, బెంగళూరులో రెండు భవనాలు ఉన్నాయి. తన ఇంట్లో రు.1.50 లక్షల విలువ చేసే వస్తువులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లగ్జరీ వస్తువుల ప్రస్తావన దానిలో రాలేదు.
మూడు అసెంబ్లీ స్థానాలకు, జిల్లా, తాలూకా పంచాయత్లకు త్వరలో ఎన్నికలు జరగబోతుండగా సిద్దరామయ్య విలాసాలు చర్చనీయాంశమవటంతో ఆయన దీనిపై ఒక పరిష్కారం కనుగొనాలని, వీలైతే వేలంలో వాటన్నంటినీ అమ్మేయాలని సొంతపార్టీ నేతలు సూచిస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ నేతలు మాత్రం దీనిని అంత తేలిగ్గా వదలబోమని, పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తామని అంటున్నారు. మరి ‘సిద్దూ’ ఏమి చేస్తారో చూడాలి.