మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఏపీ సర్కార్ గవర్నర్‌కు పంపింది. గవర్నర్ వాటిపై గతంలోలా ఆమోద ముద్ర వేయకుండా… న్యాయసలహా కోసం పంపించారు. అయితే.. ఆయన న్యాయసలహాలను… దేశంలోని ప్రముఖ న్యాయనిపుణులు.. రాజ్యాంగ నిపుణుల నుంచి తీసుకోలేదు. ప్రభుత్వ న్యాయవిభాగానికే పంపారు. కొన్ని సందేహాలను గవర్నర్ .. న్యాయవిభాగం ముందు పెట్టారు. పాలనా వికేంద్రీకరణ , సీఆర్డీఏ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయా..? రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చా.. ? అనే అంశాలపై న్యాయ సలహా కోరారు. ప్రభుత్వం పంపిన బిల్లులపై ప్రభుత్వ న్యాయవిభాగం.. వేరే అభిప్రాయంతో సలహాలిచ్చే అవకాశమే లేదు.
ఇప్పటికే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ.. గవర్నర్‌కు అనేక మంది లేఖలు రాశారు. దాని ప్రకారం.. ఆ బిల్లులు ఇప్పటికీ సెలక్ట్ కమిటీలో ఉన్నాయి. కోర్టుల్లో ఉన్నాయి. ఈ రెండు బిల్లులు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే అన్నింటినీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాను చేయాలనుకున్నది చేస్తోంది. దీంతో రాజ్యాంగాధిపతి అయిన గవర్నర్ వైపు.. అందరూ చూస్తున్నారు. ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై రాత్రికి రాత్రి సంతకం చేసి.. విమర్శలు పాలయినందున.. ఈ సారి న్యాయసలహా కోసం వెళ్లినట్లుగా తెలుస్తోంది.
అయితే.. గవర్నర్ .. ప్రభుత్వ అధీనంలోని న్యాయసలహా విభాగం నుంచి కాకుండా.. రాజ్యాంగనిపుణులు.. న్యాయనిపుణుల నుంచి అభిప్రాయం తెలుసుకుంటే… బాగుంటుందన్న అభిప్రాయం… ఏపీలోని విపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా .. రాష్ట్ర చట్టం ఉందన్న అభిప్రాయం మేరకు.. దానిపైనా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వ న్యాయవిభాగం.. క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత ఆయన… ఆ బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే.. గవర్నర్ .. తాను న్యాయ సలహా తీసుకున్నానని చెప్పుకునేందుకే.. ఆ బిల్లులను.. ప్రస్తుతం న్యాయవిభాగానికి పంపించి ఉంటారని భావిస్తారు.