రైతులకు పెన్షన్లు, ఆరు వేల పెట్టుబడి సాయంపై భూపరిమితి ఎత్తివేత సహా.. మొదటి కేబినెట్ భేటీలో మోడీ.. కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఇంత సరళీకృతమైన నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు.. దేశ ప్రజలను కాస్త ఆశ్చర్యపరిచేదే.
తెలుగింటి కోడలికి ఆర్థిక శాఖ బాధ్యతలు..!
ఐదేళ్ల పాటు… సాగిన మోదీ మొదటి దశ పాలనలో… అటు అభివృద్ధీ లేదు.. ఇటు సంక్షేమమూ లేదనేవావారే ఎక్కువ. అవి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారాంశాలు కాలేదు. జాతీయవాదం తెరపైకి వచ్చింది. కానీ జాతీయాదం భావోద్వేగాన్ని మాత్రమే సృష్టిస్తుంది. కానీ..ప్రభుత్వ పనితీరు.. ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తుంది. ఆ విషయంలో… ఎన్డీఏ మొదటి ఐదేళ్ల పాలనలో.. పాస్ మార్కులు పడలేదు. అందుకే… ఇప్పుడు మాటు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్థిక మంత్రిగా అమిత్ షా పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కానీ నరేంద్రమోదీ మాత్రం.. కొత్తగా ఆలోచించారు. నిర్మలా సీతారామన్‌కు చాన్సిచ్చారు. గత ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగా ఉన్నారు. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా పని చేశారు. జీఎస్టీ లాంటి సంస్కరణలను వేగంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. నోట్ల రద్దు సమయంలో… బలంగా నిలబడ్డారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు.. పీయూష్ గోయల్ ఆ శాఖ బాధ్యతలు చూసుకున్నారు. అయినప్పటికీ.. నరేంద్రమోదీ… ఆర్థిఖ శాఖ విషయంలో ఎంతో ఆలోచించి నిర్మలా సీతారామన్‌కు చాన్స్ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నదని వస్తున్న విమర్శలకు.. నిర్మలా సీతారామన్ తన పనితీరుతోనే చెక్ పెడతారని.. మోదీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ గట్టి పునాది వేశామని.. ఇకపై ఆర్థిక వ్యవస్థను పునర్ నిర్మించడమేనని.. నిర్మలా సీతారామన్ నిరూపిస్తారని భావిస్తున్నారు. అలాగే.. గత ప్రభుత్వం.. ఆర్థిక ప్రయోజనాల పరంగా.. దక్షిణాదిని నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దక్షిణాదికే చెందిన… నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించడం.. వ్యూహాత్మకమేనని చెప్పుకోవచ్చు.
వ్యవసాయానికి సాయం..! సాగుని పండుగ చేసే నిర్ణయాలేనా..?
ఐదేళ్ల మొదటి దశ పాలనా కాలంలో కేంద్రం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న మరో రంగం వ్యవసాయం. ఐదేళ్ల కిందట.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని… మోదీ భరోసా ఇచ్చారు. ఐదేళ్ల తర్వాత రైతులకు… పెట్టుబడి సాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాని కోసం ఓ పథకం ప్రవేశపెట్టారు. ఉత్తరాది రైతులు… దాదాపుగా ప్రతీ ఏడాది ఉద్యమాలు చేశారు. కానీ పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. అందుకే.. ఈ సారి వ్యవసాయ మంత్రిత్వ శాఖను దాదాపుగా ప్రక్షాళన చేశారు. ఐదేళ్ల పాటు ఈ శాఖను చూసిన రాధామోహన్ సింగ్‌కు ఈ సారి చోటు కల్పించలేదు. నరేందర్ సింగ్ తోమర్ కు..సాగు శాఖను అప్పగించారు. ఇందులో ప్రక్షాళన చేసి.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి… వారి ప్రశంసలు పొందాలన్న లక్ష్యంతో.. ఈ సారి మోదీ ఉన్నట్లుగా భావింవచ్చు.
ఐదేళ్ల ఫెయిల్యూర్ల ముద్ర తొలగించుకుంటారా..?
దేశ ప్రజలపై రోజువారీ ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే కేంద్రమంత్రిత్వ శాఖల్లో అత్యంత ముఖ్యమైనవి… ఆర్థిక, వ్యవసాయశాఖలే. వీటిలో మోదీ..ప్రత్యేకత చూపారు. గత ఐదేళ్లకాలంలో వచ్చిన విమర్శలను రిపీట్ కాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. నిర్ణయాలు కూడా అలాగే ఉండటంతో… పాలనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.