తెలంగాణ నిరుద్యోగులు రాజకీయ నేతల ట్రాప్లో పడిపోయినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లను, పరీక్ష తేదీలను సైతం వ్యతిరేకించేవారి సంఖ్య పెరిగిపోతోంది. నిజంగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ కష్టపడేవారు వారి పనుల్లో ఉన్నారు. కానీ రాజకీయాల కోసం నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీపై ఆందోళనలు చేసే వారి వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగ పరీక్షలు వస్తే వాయిదా వేయాలని కోరేవారు ఉంటున్నారు. వారు చేసే ఆందోళనలకు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.
పదేళ్ల నుంచి గ్రూప్ వన్ పరీక్ష జరగలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఎగ్జామ్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూంటే.. మళ్లీ జీవో నెం 29 సాకు చెప్పి వాయిదాకు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు వివాదాలు పరిష్కారమైన తర్వాత కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అశోక్ నగర్ లో వీరు చేసిన ఆందోళనకు.. బీఆర్ఎస్ మద్దతు పలికింది. తాను ఆశోక్ నగర్ కు వస్తానని లేదా తెలంగాణ భవన్ లో కలుస్తానని హామీ ఇచ్చారు. అశోక్ నగర్ కు వెళ్లే దైర్యం చేయలేకపోయిన కేటీఆర్.. తెలంగాణ భవన్ లో వారిని కలిశారు.
ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకూ నోటిఫికేషన్లు రాకండా చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను కూడా నిరుద్యోగులే నిలిపివేసుకుంటున్న పరిస్థితులు వస్తున్నాయి. ఉద్యోగ నియామకాలు ఆపేస్తే ఎంత మంది ఇబ్బంది పడతారో ఆందోళనలు చేస్తున్న వారు గుర్తించడం లేదు. కానీ వారంతా సైలెంట్ గా ఉండటం వల్ల ప్రభుత్వంపై ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపేవారి ఒత్తిడి ఎక్కవగా ఉంటుంది.