చిరంజీవి అభిమాన సంఘలన్నీ జన సేన పార్టీకి మద్దతు తెలపడానికి రెడీ అవుతున్నారని కొద్ది రోజుల క్రితం నుంచీ ప్రచారం జరుగుతోంది. దీనికి చిరు మద్దతు కూడా దొరికిందని చెప్పుకున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. చిరు అభిమాన సంఘాలన్నీ మూకుమ్మడిగా జనసేన పార్టీలో చేరి, మద్దతు తెలిపాయి. భవిష్యత్తులు జనసేన పార్టీతో కలసి పనిచేస్తామని ప్రతిన బూనాయి. ఈరోజు అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు పవన్‌తో భేటీ అయ్యారు. తమ మద్దతు తెలిపారు. ”నేను కూడా చిరంజీవి అభిమానినే. హీరో అంటేనాకు ఆయనే. ఆయన్ని ఎవరైనా ఓ మాట అంటే ఊరుకునేవాడ్ని కాదు. వెళ్లి కొట్టేసేవాడ్ని. విజేత సమయంలో ‘నువ్వేమవుదామనుకుంటున్నావు’ అని అన్నయ్య అడిగితే ‘నీకు బాడీ గార్డ్‌గా ఉంటా’ అని చెప్పా. అంతకు మించి ఏమీ తెలీదు. ‘ప్రజారాజ్యం`’పార్టీ పెట్టినప్పుడు కూడా ఓ నాయకుడి దగ్గర సేవకుడిలానే పనిచేశా. అన్నయ్యకూ నాకూ మధ్య దూరం ఉందని ఎవరెవరో ఏవేవో అనుకుంటున్నారు. కానీ మేం ఒక్కటే” అని అన్నయ్యపై తనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నాడు పవన్. చిరు ఫ్యాన్సంతా ఏకమై జనసేనకు సపోర్ట్ చేయడం పార్టీ పరంగా ఆహ్వానించదగిన పరిణామం. ఓ రకంగా… జనసేనకు స్పష్టమైన ఓటు బ్యాంకులా మరే బలం… అభిమాన సంఘాలకు ఉంది. అయితే ఈ ఓటు బ్యాంకు రాబోయే ఎన్నికలలో జనసేనకు ఎంత వరకూ చేదోడు వాదోడుగా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాలి.