తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒకే సమస్యపై ఎవరు ఎవరిపై ఏ మేరకు దాడి చేస్తారన్నది పరిశీలిస్తే తమాషాగా వుంటుంది. ఉదాహరణకు నీటి ప్రాజెక్టుల సమస్యపై నిరాహారదీక్ష చేయడానికి వైసీపీ నేత జగన్ సిద్ధమయ్యారు. దాని గురించి మొదటగా మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. వందమంది చంద్రబాబులు వెయ్యిమంది జగన్‌లు వచ్చినా తమ ప్రాజెక్టులను ఆపలేరని ఎద్దేవ చేశారు.తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఖండించారు. అయితే జగన్ గాని ఆయన పార్టీ వారు గాని చంద్రబాబును విమర్శించడమే తప్ప ఇంత మాట అన్నందుకు హరీష్‌రావుకు మాటవరుసకైనా సమాధానమివ్వరు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలంగాణ ప్రాజెక్టులు సరైనవి కావంటూనే జగన్ దీక్షను విమర్శిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటిపై లేఖ రాస్తామంటూనే ప్రతిపక్ష నేతకు చిత్తశుద్ధి లేదంటారు. ఈలోగా హరిష్ రావు మరో మాటగా జగన్ దీక్షనుంచి దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తారు.
కేంద్రం ప్రత్యేక హౌదా ఇవ్వకపోవడం విషయంలోనూ జగన్ దాడి రాష్ట్ర ప్రభుత్వంపై వుంటుంది. మీరు కేసుల కోసమే కేంద్రాన్ని ఏమీ అనడం లేదని తెలుగుదేశం వారు ఆయనపై విమర్శ చేస్తారు. అయితే ఈ విషయంలో కేంద్రం సాంతం తిరస్కరించినా విమర్శించవద్దని తమ అధినేత బహిరంగంగానే చెబుతుంటే ఇరకాటంలో పడిపోతారు. బిజెపి విషయానికి వస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వం విభజనచట్టంలో పొందుపర్చలేదనే అంశంమే చెబుతుంటుంది. దాన్ని తామెందకు సరిచేయలేదో లేక ఇతర మార్గాల్లో సహాయం ప్రకటించడంలేదో చెప్పదు. ఈ మధ్యలో చాష్ట్రం లెక్కలు సరిగ్గా చెప్పలేదని సోమువీర్రాజులు,పురంధేశ్వరి వంటి వాళ్లు విమర్శిస్తారు. కేంద్రం ఆ మాట అధికారికంగా చెప్పదు.
ఇక కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఈ సమస్యలుండవు. వారు ఎక్కడి మాట అక్కడ చెప్పడానికి వెనుకాడరు. కెసిఆర్ అన్నట్టు మహారాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణా ఎపి కాంగ్రెస్‌లు తలోమాట మాట్లాడుతాయి. అధిష్టానం అసలేదీ మాట్లాడదు. ఎపిలో జగన్, తెలంగాణలో టిడిపి నేతలు బిజెపి కేంద్రాన్ని ఏమీ అనరు గనక ఆ పాత్ర తాము పోషిస్తే రాజకీయంగా లాభమని వారు లెక్కవేసుకుంటారు.
ఇలా ఈ రాజకీయ క్రీడలో ఎవరి పాత్రలు ఎవరి డైలాగులు మాత్రమే గాక ఎవరి టార్గెట్టు ఎవరి ప్రత్యర్థులు వారికి వేర్వేరుగా వుండటం విచిత్రం. ఏతావాతా ప్రజలకు మిగిలేది గందరగోళపడే పాత్ర .